Bollaram Child: రాష్ట్రంలో సంచలనం రేపిన బొల్లారం కౌకూర్ లో ఐదేళ్ల చిన్నారి అరేలియా మోజెస్ కిడ్నాప్, హత్య కేసుకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ దారుణానికి ఒడిగట్టింది మాజీ సెక్యూరిటీ గార్డ్ విక్రమ్ కుమార్ అని, అతడిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించారనే కోపంతో పాటు డబ్బు కోసమే విక్రమ్ చిన్నారిని కిడ్నాప్ చేసి చంపేసినట్లు వెల్లడించారు. పాపను చంపాకే అతడు డబ్బు డిమాండ్ చేశాడని తెలిపారు. ఈ కేసు వివరాలను మల్కాజ్ గిరి సీపీ సుమతి మీడియాకు తెలియజేశారు. చిన్నారిని కిడ్నాప్ చేసి 20లక్షలు డిమాండ్ చేయాలన్నది విక్రమ్ ప్లాన్ అని పేర్కొన్నారు. చిన్న కుటుంబం, ధనిక కుటుంబం కావడంతో డబ్బులు ఇస్తారని విక్రమ్ భావించాడన్నారు.
ప్రతీకారం, డబ్బు కోసమే కిడ్నాప్.. దొరికిపోతాననే భయంతో హత్య
నిందితుడి కోసం 10 పోలీసు బృందాలు గాలించాయన్నారు. ఫోన్ సిగ్నల్స్, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నామన్నారు. క్లబ్ హౌస్ సెల్లార్ లోని నీటి సంపులో చిన్నారి మృతదేహం గుర్తించామన్న పోలీసులు.. సెక్యూరిటీ గార్డుగా పని చేసి మానేసిన విక్రమ్ కుమార్ ను అనుమానించామన్నారు.
పాపను తన దగ్గరే ఉంచుకుంటే తాను దొరికిపోతానని విక్రమ్ భయపడ్డాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా గేటెడ్ కమ్యూనిటీ నుంచి చిన్నారిని బయటకు తీసుకెళ్లడం అసాధ్యమని భావించాడు. అందుకే పాపను నీటి సంపులో పడేసి చంపేశాడని పోలీసులు చెప్పారు. సెల్లార్ లోకి ఎవరూ వెళ్లరని, అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవని తెలిసిన విక్రమ్.. ఆ ప్లేస్ ను ఎంచుకున్నాడని వెల్లడించారు. అతి త్వరలో విచారణ పూర్తి చేసి విక్రమ్ కు శిక్ష పడేలా చూస్తామన్నారు.
పాప కాళ్లు, చేతులు కట్టేసి నీటి సంపులో పడేశాడు
''10వ తేదీన సాయంత్రం పాప మిస్సింగ్ అయ్యింది. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో క్లబ్ హౌస్ సెల్లార్ లోని వాటర్ సంపులో చిన్నారి మృతదేహం లభ్యమైంది. విల్లా ఆర్కిడ్ గేటెడ్ కమ్యూనిటీలో ఆడుకుంటూ వెళ్లిన చిన్నారిని విక్రమ్ కిడ్నాప్ చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించాము. క్లబ్‌హౌస్ దగ్గర ఉన్న చిన్నారిని విక్రమ్ సెల్లార్లోకి తీసుకెళ్లాడు. కాళ్లు, చేతులు కట్టేసి నడుముకి ఇటుకలు కట్టి నీటి సంపులో పడేశాడు.
చిన్నారి చనిపోయిందని నిర్ధారించుకున్నాక రాత్రి 7.30 గంటల సమయంలో సెల్లార్ నుంచి బయటకు వచ్చాడు. సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి వెళ్లిపోయాడు. ఆ తర్వాత బిహార్ కు చెందిన మరో సెక్యూరిటీ గార్డు ఫోన్ నుంచి పాప పేరెంట్స్ కు విక్రమ్ కాల్ చేశాడు. పాపను కిడ్నాప్ చేశానని, ప్రాణాలతో కావాలంటే 20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే, వీడియో కాల్ లో చిన్నారిని చూపించాలని కుటుంబసభ్యులు కోరారు. ఆ వెంటనే నిందితుడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో పాప తల్లిదండ్రులు బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిన్నారిని నమ్మించి తీసుకెళ్లి దారుణం
క్లబ్ హౌస్ సెల్లార్ జీ మైనస్ 1 లోని నీటి సంపులో పాప డెడ్ బాడీని గుర్తించాము. సెప్టెంబర్ 22 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు విక్రమ్ అక్కడ సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. అతడి ప్రవర్తన సరిగా లేదని విల్లా యాజమాన్యం అక్టోబర్ 6న విధుల నుంచి తొలగించింది. ఆ నిర్ణయం తీసుకున్న కమిటీలో చిన్నారి తాత కూడా ఉండటంతో ఆయనపై పగ పెంచుకున్నాడు. ప్రతీకారంతో పాటు డబ్బు సంపాదించాలనే దురాలోచనతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. 10వ తేదీ సాయంత్రం గేటెడ్ కమ్యూనిటీ లోపలికి విక్రమ్ వచ్చాడు. సైకిల్ పై ఆడుకుంటున్న చిన్నారిని చూశాడు. పాపను నమ్మించి తీసుకెళ్లాడు. హత్య చేసి బయటకు వెళ్లాక డబ్బు డిమాండ్ చేయాలనుకున్నాడు'' అని పోలీసులు వెల్లడించారు.
బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ తప్పనిసరి
ఈ ఘటనతో గేటెడ్ కమ్యూనిటీల్లో నివాసం ఉంటున్న వారికి పోలీసులు కీలక సూచనలు చేశారు. ఇంట్లో పని మనుషులు, డ్రైవర్లు, వాచ్ మెన్లు, సెక్యూరిటీ గార్డులు, ఇతర సేవా సిబ్బంది.. ఎవరిని నియమించుకున్నా వారి చిరునామాలు తీసుకోవాలన్నారు. పని వాళ్లను నియమించుకునేటప్పుడు కచ్చితంగా వారి బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పని వాళ్ల బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేశామన్నారు. పనివాళ్లను నియమించుకునేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ తప్పనిసరి
మేడ్చల్ జిల్లా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్‌లో విల్లా ఆర్కిడ్ గేటెడ్ కమ్యూనిటీలో మిల్టన్ ఫెర్నాండెజ్ నివాసం ఉంటున్నారు. అదే విల్లాలో నిందితుడు విక్రమ్ వాచ్‌మన్‌గా పని చేశాడు. డబ్బు కోసం విక్రమ్ దారుణానికి ఒడిగట్టాడు. ఫెర్నాండెజ్ ఐదేళ్ల కూతురు అరేలియా మోజెస్ కిడ్నాప్, హత్య ఉదంతం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. విల్లాలో సెక్యూరిటీ గార్డుగా పని చేసిన విక్రమ్ డబ్బు కోసం ఇంతటి కిరాతకానికి ఒడిగట్టాడని తెలిసి అంతా షాక్ అయ్యారు.
సీపీ సుమతి మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే చిన్నారి తల్లిదండ్రులు, కమ్యూనిటీ వాసులు పోలీసు కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. చిన్నారికి వెంటనే న్యాయం చేయాలని, నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పారు. చట్టప్రకారం నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.


