తెలంగాణ

నీళ్లు లేవు.. ఆరుతడి పంటలే సాగు చేయాలి- సీఎం రేవంత్

5 నిమిషాల పఠనం

రాష్ట్రంలోని రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. యాసంగిలో ఆరు తడి పంటలు మాత్రమే వేయాలని కోరారు. విపక్ష నేతల తప్పుడు మాటలు విని మోసపోవద్దని హెచ్చరించారు.

Cm Revanth: రాష్ట్రంలోని రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. యాసంగిలో ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని కోరారు. విపక్ష నేతల తప్పుడు మాటలు విని మోసపోవద్దని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రం అవుతాయని.. జూలై వరకు వర్షాలు రావని, ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. అందరం కలిసికట్టుగా ఉండి ఎల్ నినోను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

''ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీళ్లు తాగునీటి అవసరాలకే సరిపోతాయి. ముందు ముందు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. రైతులు ఆరుతడి పంటలే సాగు చేయాలి. ఎల్‌నినోపై బీఆర్ఎస్ నేతల ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందరం కలిసికట్టుగా పరిస్థితులను ఎదుర్కొందాం'' అని సీఎం రేవంత్ అన్నారు.

గెలిపించలేదని.. ప్రజలపై కేసీఆర్ కుటుంబం పగబట్టింది

తమను గెలిపించలేదని ప్రజలపై కేసీఆర్ కుటుంబం పగబట్టిందన్నారు. ఓటు వేయలేదనే కక్షతో అబద్దాలు చెప్పి ఆగం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎల్ నినో విషయంలోనూ బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ప్రపంచవ్యాప్తంగా కరువు వస్తే.. తెలంగాణలో మాత్రమే వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బావబామ్మర్దులు ఊళ్లపై పడి అబద్ధాలు చెబుతారని, వారి మాటలు విని రైతులు నష్టపోవద్దన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల జోలికి వెళ్లకుండా ఆరుతడి పంటలే సాగు చేయాలని కోరారు.

మహబూబ్ నగర్ జిల్లాకు కేసీఆర్ చేసింది శూన్యం

''తెలంగాణ వస్తే పాలమూరు జిల్లా బాగుపడుతుందని, పాలమూరు జిల్లాకు న్యాయం జరుగుతుందని ఆశపడ్డాం. తెలంగాణ రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ప్రజలు ఆశలు నెరవేరేవి. మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికైన కేసీఆర్ ఈ జిల్లాకు చేసింది శూన్యం. స్థానికుడైన విఠల్ రావును ఓడించి మరీ కేసీఆర్ ను గెలిపించారు'' అని సీఎం రేవంత్ అన్నారు.

మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసుకోకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు వెళ్తున్నాయన్న బీఆర్ఎస్ ఆరోపణలపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. ఆ ఆరోపణల్లో నిజం లేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో 16 టీఎంసీల నీరు ఉంటేనే కన్నెపల్లి నుంచి ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు దించే పరిస్థితి కూడా లేదన్నారు. బీఆర్ఎస్ అవినీతి వల్లే ఈ మూడు బ్యారేజీలు పనిచేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన దేవాదుల, వైఎస్ఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులే ప్రస్తుతం రైతులకు, ఖమ్మం జిల్లాకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు.

మూడు రోజుల కొడంగల్‌ నియోజకవర్గ పర్యటనలో భాగంగా శనివారం హకీంపేట, దుద్యాల మండలాల్లో రైతు మేళా, ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పోను ప్రారంభించారు సీఎం రేవంత్. పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. హకీంపేటలో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులను పరిశీలించారు.

#Cm Revanth#Brs#Telangana#Congress#Kodangal#Farmers#Elnino#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి