‘జెన్ జీ, జెన్ అల్ఫా’ వంటి నేటితరం పిల్లలు, యువకులు ప్రశ్నించడంలో ముందుంటున్నారు. వారికి సమస్య మీద పూర్తిగా అవగాహన ఉన్నా లేకున్నా గట్టిగా నిలదీయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్వాలిటీ, ప్రశ్నించేతత్వం లేకపోవడం వల్లే దేశం,రాష్ట్రాల్లోని వివిధ ప్రభుత్వాలు జవాబుదారీతనం పాటించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు, మెరుగైన రోడ్డు, బస్సు సౌకర్యం, తాగు నీటి ఇబ్బందులు, పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కోసం ప్రశ్నించే గొంతుకలు పెరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే పాఠశాలకు వెళ్లేందుకు స్టాప్‌లో ఎదురుచూస్తుండగా బస్సు ఆపలేదని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిగెత్తుకుంటూ వెళ్లి మరి బస్సును ఆపారు. అనంతరం ముగ్గురు విద్యార్థినులు బస్సుకు ఎదురుగా నిలబడి డ్రైవర్, కండక్టర్‌ను నిలదీశారు. బస్సు ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. దీంతో బస్సులోని ప్రయాణికులు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ పిల్లలకు సమాధానం చెప్పడంలో డ్రైవర్, కండక్టర్ తడబడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకివెళితే.. కర్ణాటకలోని కొప్పళ తాలూకా బి.హొసహళ్లి బస్టాప్‌లో విద్యార్థులు ఎదురుచూస్తున్నా హట్టి-ముండర్గి నుంచి కొప్పళ వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు ఆపకుండా వెళ్లిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పరీక్షకు ఆలస్యమవుతుందనే ఆందోళనతో ఓ విద్యార్థిని బస్సును వెంబడించి ముందుకెళ్లి ఆపింది. ‘బస్సు ఆపకపోతే పరీక్షకు ఎలా వెళ్లాలి...? పరీక్ష మిస్సయితే ఎవరు బాధ్యత వహిస్తారు...?’ అంటూ డ్రైవర్, కండక్టర్‌ను నిలదీసింది.
గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు నిర్ణీత స్టాప్‌లలో ఆపకపోవడం, సమయానికి రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆరోపించారు. స్కూల్, కాలేజీ వేళల్లో బస్సు సర్వీసులు పెంచాలని కేఎస్ఆర్టీసీ అధికారులను కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాగు మెరుగైన విద్యకోసం పాఠశాలలు ఏర్పాటు చేయడం లేదని.. కనీసం వారికి బస్సు సర్వీసు సౌకర్యాన్ని అయినా ఏర్పాటు చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. బస్సుకు ఎదురుగా నిలబడి తమ సమస్య కోసం పోరాడిన విద్యార్థునుల ధైర్యాన్ని పలువురు అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.


