True Up Charges: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీశ్ రావు. విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ ఛార్జీల భారం తగ్గించాలంటే దానిపై భట్టి విక్రమార్క సమాధానం దాటవేశారని విమర్శించారు. కుంటి సాకులు చెప్పి సంబంధం లేని కాగితాలు చూపిస్తారా అంటూ మండిపడ్డారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడం మానుకోవాలన్నారు. లేదంటే ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమని హెచ్చరించారు హరీశ్ రావు.
పండక్కి శుభవార్త చెబుతారనుకుంటే ఉసూరుమనిపించారు
రాజకీయ లబ్ది కోసం, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు తాను అసత్యాలు ప్రచారం చేస్తున్నాను అంటూ భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. కుంటి సాకులు చెప్పి, సంబంధం లేని కాగితాలు చూపి ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పకుండా తప్పించుకున్నట్లుగా భట్టి విక్రమార్క తీరు ఉందని ధ్వజమెత్తారు. విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ ఛార్జీల పేరిట రూ.5,420 కోట్ల భారం మోపడం గురించి BRS ప్రశ్నిస్తే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోవడం ప్రజాపాలన అంటారా? అని భట్టి విక్రమార్కను నిలదీశారు హరీశ్ రావు. ప్రజలపై మోపిన భారాన్ని ఉపసంహరించుకొని పండుగ పూట శుభవార్త చెబుతారనుకుంటే భట్టి విక్రమార్క ఉసూరుమనిపించారని విమర్శించారు.
కరెంటు సరఫరా చేస్తే రైతులు ఎందుకు ధర్నాలు చేస్తారు?
రూ.5,420 కోట్ల భారం ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తామని భట్టి విక్రమార్క పక్కనే కూర్చొని అధికారులతో చెప్పించడం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనం అని ధ్వజమెత్తారు. రైతులు రోడ్ల మీదకు వచ్చి కరెంట్ కోసం ధర్నాలు చేస్తుంటే, కోతలే లేవు అని చెప్పడం మీకే చెల్లిందన్నారు. మీరు సక్రమంగా కరెంట్ సరఫరా చేస్తే రైతులు సబ్ స్టేషన్ల ముందుకు ఎందుకు వస్తారు? ఎందుకు రోడ్లపై ధర్నాలు చేస్తారు? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
BRS ప్రభుత్వంలో ఏనాడైనా రైతులు రోడ్లెక్కారా?
BRS ప్రభుత్వ హయాంలో ఏనాడైనా ఇలా రైతులు రోడ్లెక్కారా? మీరు తెస్తానన్న అనాటి రోజులు ఇవేనా? ప్రజల సమస్యల గురించి మాట్లాడుతుంటే సవాళ్లు విసిరిన భట్టి విక్రమార్క.. మేము అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా ఎందుకు సమాధానం చెప్పలేదు? భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ 15.02.2018 నాటి F. No. 23014/1/2018-CLD ప్రకారం, ఎస్సీసీఎల్ (SCCL) గనుల నుండి 14 MTPA G-9 గ్రేడ్ బొగ్గును యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్కు కేటాయించింది. మరి కేటాయింపు లేదని ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎందుకు సత్య దూరపు మాటలు మాట్లాడారు?
ఎల్ నినో పేరుతో తప్పించుకునే ప్రయత్నం
ఎల్ నినో సాకు చెబుతూ యాదాద్రిలో 3000 మెగావాట్లు, భద్రాద్రిలో 540 మెగావాట్లు, కేటీపీఎస్ లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అగిన మాట నిజం కాదా? ఇది మీ పరిపాలన వైఫల్యం కాకుంటే మరేమిటి? రాష్ట్రంలో మొత్తంగా 140 మిలియన్ యూనిట్ల కెపాసిటీ ఉంటే 89 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు మీరే చెప్పారు కదా? ఇది మీ వైల్యం కాదా?
రాయలసీమలో నీళ్ళు, బొగ్గు లేని చోట థర్మల్ ప్లాంట్ పెట్టింది నిజం కాదా?
బొగ్గు ఉన్న దగ్గరే విద్యుత్ ప్లాంట్ ఉండాలే అని చెబుతున్న మీరు, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాయలసీమలో నీళ్ళు, బొగ్గు లేని చోట థర్మల్ ప్లాంట్ పెట్టింది నిజం కాదా? ఆనాడు ఎందుకు మౌనంగా ఉన్నారు? సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధన పెట్టి అధిక ధరలకు టెండర్లు కట్టబెట్టి, అనుయాయులకు లబ్ధి చేకూర్చింది మీ ప్రభుత్వం కాదా? ఇప్పటికీ ఆ టెండర్లు రద్దు చేయనిది, విచారణ జరపంది నిజం కాదా?
విద్యుత్ కోతలకు కారణం మీరు కాదా?
మన రాష్ట్ర విద్యుత్ అవసరాలు పక్కన పెట్టి, సింగరేణి నిర్మిస్తున్న 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను రాజస్తాన్ రాష్ట్రానికి ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నది స్వయంగా మీరు కాదా? ఇది రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయం కాక మరేమిటి? రూపాయి పెట్టుబడి లేకుండా, తక్కువ ధరకు 1600 మెగావాట్ల విద్యుత్ ను మన రాష్ట్రానికి ఎన్టీపీసీ సరఫరా చేస్తానన్నా దాన్ని తిరస్కరించి, ఈరోజు విద్యుత్ కోతలకు కారణం అయ్యింది మీరు కాదా?
40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు లేనివి ఉన్నట్లు చూపి ఇన్ కమ్ ట్యాక్స్, కోల్ సెస్, DMFT చెల్లించి మోసం చేసింది నిజం కాదా? ఆ 40 లక్షల టన్నుల బొగ్గు ఎటూ పోలేదని బుకాయించిన మీరు, ఈనాడు బొగ్గు కొరత ఉందని చెప్పడం తలా తోక లేని వ్యవహారం కాదా? నిజంగా ఆ 40 ఆ లక్షల టన్నుల బొగ్గు ఉండి ఉంటే, ఈరోజు కరెంట్ కష్టాలు ఎందుకు ఉంటాయి?
మీ పాలనా వైఫల్యం వల్లే సాగునీరు, కరెంట్ కొరత
నదుల్లో నీళ్లు ఉన్నా మోటార్లు నడపక నీళ్లు లిఫ్ట్ చేయక సాగు నీళ్లు అందించలేదు. బొగ్గు నిల్వలు పెట్టుకోకుండా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయక రైతులకు కరెంట్ సరఫరా చేయడం లేదు. మీ పాలన నిర్లక్ష్యం వల్ల సాగు నీటి కొరత, కరెంట్ కొరత వచ్చింది నిజం కాదా? సింగరేణి సహా విద్యుత్ సంస్థలను IPO, కొత్త అప్పుల దిశగా తీసుకెళ్లేందుకు ఎనర్జీ రిఫార్మ్స్ కమిటీనీ ఏర్పాటు చేసి, దానికి చైర్మన్ గా ప్రొఫెసర్ అరవింద్ సుబ్రమణ్యంను నియమించాలనే ప్రతిపాదన నిజమా కాదా? ఆ నోట్ ఫైల్ బహిర్గతం చేయగలరా?
ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టింది నిజం కాదా?
నెహ్రూ సోషలిజం పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతున్నామని డబ్బా కొట్టుకున్న మీరు.. యాదాద్రి పవర్ ప్లాంట్ లో కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాలను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టింది నిజం కాదా? యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులంతా రోడ్డెక్కి ధర్నాలు చేసింది నిజం కాదా? ఈరోజు తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి కారణం మీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు కాక మరేమిటి?
కరెంట్ కోతలతో రైతులకు అనేక ఇబ్బందులు ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈరోజు మీడియా సమావేశంలో రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. చేతికి వచ్చే పంటను కాపాడుకుందాం అంటే కరెంట్ లేదు, నీళ్లు లేవు. కడుపు మండిన రైతులు సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత రైతులు కరెంట్ కోసం పోరాటాలు చేస్తున్నారు. లో వోల్టేజ్ సమస్యతో ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లు కాలి రైతులు అనేక వ్యయ ప్రయాసలకు లోనవుతున్నారు.
ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం
ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియక పొలాల దగ్గర వేచి చూస్తూ.. పాము కాట్లకు గురై రైతులు ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి. మీ నిర్లక్ష్యం, మీరు చేసిన పాప ఫలితం ఈరోజు రాష్ట్రంలో కరెంట్ సంక్షోభం. ప్రెస్ మీట్లు పెట్టి మాపై నిందలు వేసినంత మాత్రాన ప్రజల కరెంట్ కష్టాలు తీరవు. ఇప్పటికైనా కళ్లు తెరిచి కరెంట్ కోతలు లేకుండా చూడాలని, ట్రూ అప్ ఛార్జీల పేరిట ప్రజలపై వేసిన రూ.5,420 కోట్ల విద్యుత్ భారాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ప్రజా పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధం అవుతుంది'' అని మరోసారి హెచ్చరించారు హరీశ్ రావు.


