గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో బ్లాకేజీలు ఉన్నాయా, రక్తప్రసరణకు ఎంతమేరకు ఆటంకం ఏర్పడిందో తెలుసుకోవడానికి నిర్వహించే ముఖ్యమైన పరీక్ష యాంజియోగ్రామ్. ముఖ్యంగా గుండె రక్తనాళాలను పరిశీలించే ప్రక్రియను కోరోనరీ యాంజియోగ్రామ్ అంటారు. ఇది రక్తనాళాలను నేరుగా చూపించే ప్రత్యేక ఎక్స్రే ఆధారిత పరీక్ష.
యాంజియోగ్రామ్ను సాధారణంగా క్యాథ్ల్యాబ్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. ముందుగా రోగికి అవసరమైన ప్రాథమిక పరీక్షలు చేసి, ప్రక్రియకు సిద్ధం చేస్తారు. సాధారణంగా జనరల్ అనస్థీషియా అవసరం ఉండదు. రోగి స్పృహలోనే ఉంటారు. కేథెటర్ను ప్రవేశపెట్టే ప్రాంతంలో మాత్రమే మత్తుమందు ఇస్తారు.
ఆ తర్వాత చేతి మణికట్టు వద్ద ఉన్న రేడియల్ ఆర్టరీ లేదా తొడ భాగంలోని ఫెమోరల్ ఆర్టరీ ద్వారా సన్నని కేథెటర్ను రక్తనాళంలోకి ప్రవేశపెడతారు. ఆ కేథెటర్ను గుండెకు సంబంధించిన రక్తనాళాల వరకు తీసుకెళ్తారు. అనంతరం కేథెటర్ ద్వారా కాంట్రాస్ట్ డైని రక్తనాళాల్లోకి పంపిస్తారు.
కాంట్రాస్ట్ డై రక్తప్రవాహంలోకి చేరిన సమయంలో ప్రత్యేక ఎక్స్రే ఇమేజింగ్ చేస్తారు. దీనివల్ల గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల నిర్మాణం, రక్తప్రసరణ పరిస్థితి, బ్లాకేజీ ఉన్న ప్రాంతం, బ్లాకేజీ తీవ్రత వంటి అంశాలు వైద్యులకు స్పష్టంగా కనిపిస్తాయి. రక్తనాళంలో గణనీయమైన బ్లాకేజీ గుర్తిస్తే, దాని తీవ్రతను బట్టి తదుపరి చికిత్సను కార్డియాలజిస్ట్ నిర్ణయిస్తారు.
పరీక్ష పూర్తయిన తర్వాత కేథెటర్ను బయటకు తీసి, రక్తస్రావం నియంత్రించేందుకు కేథెటర్ ప్రవేశపెట్టిన ప్రాంతంపై బ్యాండేజ్ వేస్తారు. అనంతరం రోగిని కొంతసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. కేథెటర్ ప్రవేశపెట్టిన ప్రాంతంలో రక్తస్రావం, వాపు లేదా ఇతర సమస్యలు లేవని నిర్ధారించిన తర్వాత డిశ్చార్జ్ చేస్తారు.
యాంజియోగ్రామ్ సమయంలో ఉపయోగించే కాంట్రాస్ట్ డై శరీరం నుంచి బయటకు వెళ్లేందుకు సాధారణంగా తగినంత ద్రవాలు తీసుకోవాలని సూచిస్తారు. అయితే కిడ్నీ వ్యాధులు ఉన్నవారు లేదా ద్రవాల పరిమితి అవసరమైన ఇతర ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు మాత్రం వైద్యుల సూచనల మేరకే నీరు తీసుకోవాలి.
యాంజియోగ్రామ్కు ముందు కాంట్రాస్ట్ డైకి గతంలో అలర్జీ ఉన్నా, కిడ్నీ సమస్యలు ఉన్నా, రక్తం పలుచబరిచే మందులు లేదా ఇతర మందులు వాడుతున్నా వైద్యులకు ముందుగానే తెలియజేయడం చాలా ముఖ్యం.
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్ను సంప్రదించాల్సిందిగా మనవి!..


