జాతీయం

ఉద్యోగమంటున్నారు.. రష్యా సైన్యంలో చేరుస్తున్నారు.. భారతీయుల్లారా బీ అలర్ట్!

9 నిమిషాల పఠనం

ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలని చూస్తున్నారా..? రష్యాలో మంచి జీతంతో ఉద్యోగం వస్తుందని ఎవరైనా ఆఫర్ చేస్తున్నారా..? అయితే ఒక్కసారి ఆగి ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఉద్యోగం పేరుతో రష్యాకు వెళ్లి.. అక్కడి సైన్యంలో చిక్కుకున్న భారతీయుల వ్యవహారం ఇప్పుడు మరింత తీవ్రమవుతోంది.

రష్యా సైన్యంలో భారతీయులు

తెలియని దేశంలో అష్టకష్టాలు

ఇప్పటికే 51 మంది మృతి

తెలంగాణ నుంచే ఎక్కువ వలసలు

ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలని చూస్తున్నారా..? రష్యాలో మంచి జీతంతో ఉద్యోగం వస్తుందని ఎవరైనా ఆఫర్ చేస్తున్నారా..? అయితే ఒక్కసారి ఆగి ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఉద్యోగం పేరుతో రష్యాకు వెళ్లి.. అక్కడి సైన్యంలో చిక్కుకున్న భారతీయుల వ్యవహారం ఇప్పుడు మరింత తీవ్రమవుతోంది.

ఇప్పటికే రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 227 మంది భారతీయులు రష్యా సాయుధ దళాల్లో చేరగా.. 139 మందిని విడుదల చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇంకా కొంతమంది రష్యా సైన్యంలోనే ఉన్నారు. వారిని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి మాస్కోతో చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ నుంచి వచ్చిన తాజా ఫిర్యాదులు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

తెలంగాణలో 4 కుటుంబాల ఆందోళన

రష్యా సైన్యంలో చిక్కుకున్నామని చెబుతున్న నలుగురు తెలంగాణ వ్యక్తుల కుటుంబాలు తాజాగా హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించాయి. సాధారణ ఉద్యోగాల కోసం రష్యాకు వెళ్లిన తమవారిని సైనిక వ్యవస్థలోకి తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు. వారిలో కొందరు ప్రస్తుతం సైనిక శిబిరాల్లో ఉన్నారని.. మరికొందరిని యుద్ధ ప్రాంతానికి దగ్గరగా తరలించినట్లు కుటుంబాలకు సమాచారం అందిందని చెబుతున్నారు.

నాగర్‌కర్నూల్‌ ఒక్కటే కాదు.. ఈసారి వచ్చిన కేసుల్లో నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల ప్రాంతాలకు సంబంధించిన కుటుంబాల ఆందోళన కూడా ఉంది. కొందరితో ఫోన్‌ ద్వారా మాత్రమే మాట్లాడగలిగారు. ఒక వ్యక్తి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని కుటుంబం చెబుతోంది. దీంతో వారి పరిస్థితిపై ఆందోళన మరింత పెరిగింది.

నమ్మిస్తారు.. రష్యాకు పంపిస్తారు.. అక్కడ కథ మారుతుంది?

ఈ కేసుల్లో అత్యంత కీలకమైన అంశం ఉద్యోగం పేరుతో వెళ్లడం. తెలంగాణ కుటుంబాలు సమర్పించిన పత్రాల్లో రష్యాలో సాధారణ, మెకానికల్, హెల్పర్ ఉద్యోగాల పేరుతో ఇచ్చిన ప్రకటనలు కూడా ఉన్నాయి. నెలకు సుమారు 477 డాలర్ల జీతం, ఉచిత ఆహారం, పది గంటల పని, నెలకు 28 రోజులు పని వంటి వివరాలు ఆ ప్రకటనలో ఉన్నట్లు బాధిత కుటుంబాలు చెబుతున్నాయి.

అంటే.. బయటకు కనిపించేది సాధారణ ఉద్యోగం. కానీ రష్యా చేరుకున్న తర్వాత పరిస్థితి మారిందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగం కోసం వెళ్లిన వ్యక్తులు చివరకు సైనిక శిబిరాల్లో ఉండాల్సి వస్తోందని, యుద్ధ ప్రాంతానికి దగ్గరగా వెళ్లాల్సి వస్తోందని వారు చెబుతున్నారు.

ఆఫర్లు నమ్మొద్దు....

ఇక్కడే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉద్యోగం పేరుతో వచ్చే ప్రతి ఆఫర్‌ను నమ్మొద్దు అంటూ హెచ్చరిస్తోంది. ఇప్పటికే 51 మంది ప్రాణాలు పోయాయి.. అందుకే కేంద్రం సీరియస్ అవుతోంది. విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం రష్యా సైన్యంలోకి వెళ్లిన 227 మంది భారతీయుల్లో 51 మంది మరణించారు. 139 మంది విడుదలయ్యారు. మిగిలిన వారిని కూడా తిరిగి తీసుకురావడానికి భారత్ రష్యాతో సంప్రదింపులు కొనసాగిస్తోంది.

ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజాగా మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. విదేశాంగ శాఖ మాటల్లోనే చెప్పాలంటే.. రష్యా సైన్యంలో చేరడం డేంజరస్ పాత్. ఇలాంటి చర్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ధృవీకరించని వ్యక్తుల నుంచి వచ్చే ఉద్యోగ ఆఫర్లకు ఆకర్షితులు కావద్దని భారతీయులను హెచ్చరించింది.

మధ్యవర్తుల మాటలు నమ్మొద్దు

ఇక్కడ మరో కీలకమైన హెచ్చరిక కూడా ఉంది. రష్యా సైన్యంలో విదేశీయుల నియామకాలు కేవలం అధికారిక మార్గాల్లోనే జరుగుతున్నాయనే పరిస్థితి లేదని.. ప్రైవేట్ సంస్థలు, వాలంటరీ గ్రూపుల ద్వారా కూడా విదేశీయుల నియామకాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్రం పేర్కొంది.

అందుకే విదేశీ ఉద్యోగం కోసం వెళ్లేవారు ఏజెంట్ ఎవరు? కంపెనీ ఏంటి? ఉద్యోగ ఒప్పందంలో ఏముంది? వీసా ఏ కేటగిరీ? ఆ సంస్థకు అధికారిక గుర్తింపు ఉందా? అనే విషయాలను ముందే పరిశీలించుకోవాలని సూచిస్తోంది. ముఖ్యంగా విదేశాంగ శాఖలో రిజిస్టర్ కాని ఏజెంట్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం చెబుతోంది.

తెలంగాణకు ఇది మరో హెచ్చరిక

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తెలంగాణకు ఇప్పటికే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఈ నెలలోనే జగిత్యాల జిల్లాకు చెందిన వావిలాల సుదర్శన్ ఉక్రెయిన్‌లో రష్యా క్షిపణి దాడిలో మరణించగా, తెలంగాణకు చెందిన మరో వ్యక్తి గాయపడ్డారు. సుదర్శన్‌కు నెలకు రూ.90 వేల ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు చెప్పగా.. ఆయన ఏజెంట్‌కు రూ.6 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.

మరోవైపు రష్యా సైన్యంలో చిక్కుకున్నామని చెబుతున్న నలుగురు తెలంగాణ వ్యక్తుల కుటుంబాలు ప్రభుత్వ సహాయం కోరడం ఆందోళనను మరింత పెంచుతోంది. వారి ఫిర్యాదులను తెలంగాణ ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖ, మాస్కోలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేయడానికి పంపినట్లు అధికారులు తెలిపారు.

జీతం ఎంతైనా.. ప్రాణం కంటే ఎక్కువ కాదు

రష్యాలో ఉద్యోగం.. మంచి జీతం.. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మార్చుకోవాలనే ఆశ. ఇదే చాలామంది యువకులను విదేశాల వైపు తీసుకెళ్తోంది. కానీ ఉద్యోగం పేరుతో వెళ్లి యుద్ధంలో చిక్కుకుంటే.. అక్కడి నుంచి బయటపడటం అంత సులభం కాదు.

227 మంది రష్యా సైన్యంలో చేరినట్లు భారత ప్రభుత్వానికి సమాచారం ఉండటం.. వారిలో 51 మంది మరణించడం.. తెలంగాణలో తాజాగా నాలుగు కుటుంబాలు తమవారిని రక్షించాలని ప్రభుత్వాన్ని ఆశ్రయించడం.. ఈ మొత్తం వ్యవహారం ఎంత తీవ్రమైనదో చెబుతోంది. అందుకే రష్యా ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రతి ఆఫర్‌ను ఒకటికి రెండుసార్లు కాదు.. పూర్తిగా ధృవీకరించుకోవాల్సిందే.

#Russia Army#Indian Citizens in Russia#Russian Army Recruitment#Russia Ukraine War#Indians in Russian Army#MEA Advisory#51 Indians Killed#Telangana Indians#Telangana News#Russia Job Scam#Russia Jobs#Indian Army Recruits Russia#Foreign Jobs Scam#Russia Ukraine Conflict#Indian Nationals Russia
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి