తెలంగాణ

No Water: మంత్రి ఇలాకాలో తాగునీటి కష్టాలు.. నీళ్ల కోసం రోడ్డెక్కిన ప్రజలు

4 నిమిషాల పఠనం

No Water: తెలంగాణలో నీటి కష్టాలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే సాగునీరు లేక చాలా చోట్ల పంట పొలాలు ఎండిపోతున్నాయి. సాగునీటి కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు.

No Water: తెలంగాణలో నీటి కష్టాలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే సాగునీరు లేక చాలా చోట్ల పంట పొలాలు ఎండిపోతున్నాయి. సాగునీటి కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పొలాలకు నీరు అందించాలంటూ రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. తాజాగా తాగునీటి కష్టాలు కూడా మొదలయ్యాయి. పలు ప్రాంతాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి కనిపిస్తోంది. తాగేందుకు నీళ్లు దొరక్క ప్రజలు దాహంతో అలమటిస్తున్నారు. ఖాళీ బిందెల‌తో రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు.

ఖాళీ బిందెలతో నిరసన

మంత్రి వాకిటి శ్రీహరి ఇలాకాలో తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో కొన్ని రోజులుగా తాగునీళ్లు రావడం లేదంటూ నందిని నగర్ కాలనీ వాసులు ఆందోళన బాటపట్టారు. మక్తల్-కర్ణి రహదారిపై బైఠాయించి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.

ఇంకా ఎన్నాళ్లు ఇలా నీళ్లు కొనాలి?

''తాగేందుకు కూడా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. నీళ్లు లేక వంట చేసే ప‌రిస్థితి కూడా లేదు. 20 రూపాయ‌లు పెట్టి ఫిల్ట‌ర్ నీళ్లు కొంటున్నాము. తాగేందుకు, వంట చేసేందుకు ఆ నీరే వాడుతున్నాము. ఇలా ఇంకా ఎన్ని రోజులు ఇలా నీళ్లు కొనాలి? వెంటనే అధికారులు స్పందించి మాకు తాగునీరు అందేలా చూడాలి, మా దాహార్తిని తీర్చాలి'' అని స్థానికులు డిమాండ్ చేశారు.

పాలకులు మారినా తీరని తాగునీటి సమస్య

నారాయణపేట జిల్లా మక్తల్ 5వ వార్డు పరిధిలోని నందిని నగర్ కాలనీలో మంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించారు. కాలనీలో నెలల తరబడి మంచి నీరు సరఫరా కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించి నీటిని కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందన్నారు.

సమస్యను పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం మాత్రం దొరకలేదన్నారు. పాలకులు మారుతున్నా తమ తాగునీటి కష్టాలు మాత్రం తీరడం లేదన్నారు. ఎన్నికల సమయంలో నాయకులు ఓట్ల కోసం తమ దగ్గరికి వస్తారని, అది చేస్తాం ఇది చేస్తాం అంటూ తమకు పెద్ద పెద్ద హామీలు ఇస్తారని.. అధికారంలోకి వచ్చాక తమను కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి