Medicover: సికింద్రాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్ వివాదాలకు కేరాఫ్ గా మారింది. చికిత్స కోసం వెళ్తే ప్రాణాలే పోతున్నాయి. కిడ్నీలో రాళ్లకు చికిత్స చేయించుకోవడానికి మెడికవర్ ఆసుపత్రికి వెళ్లిన యువ న్యాయవాది ఐశ్వర్య చనిపోయిన ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. అది మరువకముందే..
అక్కడ మరో దారుణం చోటు చేసుకుంది. ట్రీట్ మెంట్ కోసం వెళ్లిన ఓ చిన్నారి అనూహ్యంగా మరణించింది. అంతేకాదు పాప చనిపోయిన విషయాన్ని దాచి చికిత్స అందిస్తున్నట్లు మెడికవర్ ఆసుపత్రి సిబ్బంది ఆడిన డ్రామా విస్మయానికి గురి చేసింది. ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యమే వల్లే తమ పాప చనిపోయిందని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ప్రాథమిక పరీక్షలు చేయకుండానే అనస్థీషియా
సెప్టెంబర్ 11న తల్లిదండ్రులు తమ రెండేళ్ల పాప గుణశ్రీని చికిత్స కోసం సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో తమ పాప బాగానే ఉందని తెలిపారు. పాపకు ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాలని చెప్పిన సిబ్బంది.. ప్రాథమిక పరీక్షలు చేయకుండానే అనస్థీషియా ఇచ్చారని.. దీంతో ఎంఆర్ఐ మెషిన్పైనే పాప చనిపోయిందని తెలిపారు.
ఠాగూర్ సినిమా తరహా డ్రామా
ఉదయం 10 నుండి 11 గంటల మధ్య చిన్నారి చనిపోతే, సాయంత్రం 4 గంటల వరకు చికిత్స అందిస్తున్నట్లు ఠాగూర్ సినిమా తరహాలో ఆసుపత్రి సిబ్బంది డ్రామా ఆడారని పాప తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందన్నారు. అసలేం జరిగిందో చెప్పడం లేదని, చికిత్సకు సంబంధించిన రిపోర్టులు కూడా ఇవ్వడం లేదని బాధితులు వాపోయారు. ఒక ఉద్యోగిపై తప్పు నెట్టి, అతడిని ఉద్యోగం నుండి తొలగించి ఆసుపత్రి యాజమాన్యం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని చిన్నారి తల్లిదండ్రులు మండిపడ్డారు.
ఆసుపత్రి సిబ్బంది దాడి
యాజమాన్యం వైఖరికి నిరసనగా పాప తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. కాగా, ఆసుపత్రి సిబ్బంది తమ పట్ల దురుసుగా వ్యవహరించారని.. పోలీసుల సమక్షంలోనే తమపై దాడి చేశారని చిన్నారి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి
''MRI పరీక్ష జరుగుతున్న సమయంలో మా పాప గుణశ్రీ చనిపోయింది. పాప మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం. తగిన జాగ్రత్తలు తీసుకోకుండానే అనస్థీషియా ఇచ్చారు. పాప చనిపోయిన విషయాన్ని మాకు వెంటనే తెలియజేయలేదు. చికిత్స అందిస్తున్నట్లు చాలాసేపు నాటకం ఆడారు. చిన్నారి మరణానికి సంబంధించిన పూర్తి వైద్య నివేదికలను మేము ఎంత అడిగినా ఇవ్వడం లేదు'' అని పాప తల్లిదండ్రులు కన్నీంటిపర్యంతం అయ్యారు.
కిడ్నీలో స్టోన్ ప్రాబ్లమ్‌తో వెళ్తే ప్రాణాలే పోయాయి
కాగా.. ఈ నెల 6న కిడ్నీ స్టోన్ సమస్యతో మెడికవర్ హాస్పిటల్ లో చేరిన అడ్వకేట్ ఐశ్వర్య (28) అనూహ్యంగా మృత్యువాత పడింది. వారం రోజుల ట్రీట్ మెంట్ తర్వాత బ్రెయిన్ 80 శాతం డెడ్ అయ్యిందని డాక్టర్లు చెప్పారు. ఐశ్వర్య మృతి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఐశ్వర్య మృతికి ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. ఆ దారుణం మరువక ముందే.. అదే ఆసుపత్రిలో మరో ప్రాణం పోయింది.
ఆందోళనకు గురి చేస్తున్న వరుస మరణాలు
నిన్న ఐశ్వర్య, నేడు గుణశ్రీ.. చికిత్స కోసం వెళ్లి ప్రాణాలే కోల్పోయారు. సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వరుస వివాదాలు అక్కడ చికిత్స పొందుతున్న రోగులను, వారి కుటుంబసభ్యులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.


