Tollywood: పాన్ ఇండియా సినిమా..ఈ పదం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో భారీగా వినిపిస్తున్న మాట. హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలను చేయాలనే తాపత్రయంతో ఉన్నారు. ఒక్క ఇండియాలో మాత్రమే కాకుండా ఇతర దేశాలలోనూ అభిమానులను సంపాదించుకున్న మన స్టార్స్ ..దాదాపుగా రీజనల్ సినిమాలను చేయడం మానేశారు. కథ మాత్రం ఇక్కడిదే, కానీ దానికి జోడిస్తున్న హంగులు మాత్రం దేశాలు దాటుతున్నాయి.
ఒకప్పుడు, గ్రాఫిక్స్ మాయాజాలం అనేది హాలీవుడ్ సినిమాలలో చూసేవాళ్ళం. అలా, అని మన తెలుగు సినిమాలలో లేవా అంటే..విఠలాచార్య సినిమాలలో చూశాము. కానీ, అప్పట్లో ఇలాంటి హంగు ఆర్భాటాలేమీ లేవు. వందల కోట్ల బడ్జెట్ లేదు. జగన్మోహిని లాంటి సినిమాలు సంచలన విజయాలను అందుకున్నాయి. మాయాబజార్ లాంటి సినిమాలెన్నో వచ్చాయి. కానీ, ఇక్కడ ఒక భాషలో తీసిన సినిమాను పాన్ ఇండియా అంటూ సౌత్ భాషలతో పాటు బాలీవుడ్ లోనూ రిలీజ్ చేస్తున్నారు.
దీనికోసం భారీ సెట్స్..సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుతున్నారు. ఇంత సమయం..ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమా, కనీసం వారం రోజులు కూడా ఆడటం లేదు. ఇటీవల వచ్చిన 'ది రాజాసాబ్' కథనే తీసుకుందాం. అసలు ఈ సినిమాకి వీఎఫెక్స్ అవసరమా.! అనే సందేహాలు కలగకమానవు. పైగా ప్రభాస్ లాంటి హీరోతో రెండేళ్ళ పాటు తీసిన సినిమా. ఫలితం గురించి మాట్లాడుకోలేము. అదే, చిన్న బడ్జెట్ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తోంది. ఈ సినిమాలకి ఎటువంటి గ్రాఫిక్స్ అవసరం ఉండటం లేదు.
ఈ మధ్య కాలంలో సింపుల్గా వచ్చిన బలగం, రాజు వెడ్స్ రాంబాయి, లిటిల్ హార్ట్స్ సంచలన విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు, 1300 కోట్లు పెట్టి రాజమౌళి తీస్తున్న వారణాసి 120 దేశాలలో రిలీజ్ చేస్తున్నారు. ఇదే, రాజమౌళి సునీల్ హీరోగా ఎలాంటి వీఎఫెక్స్ లేకుండా మర్యాదరామన్న సినిమాను తీసి మంచి కమర్షియల్ సక్సెస్ను అందుకున్నారు. బాహుబలి సినిమా వచ్చిన సమయంలో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల సునామీని సృష్ఠించిందో అందరికీ తెలిసిందే. మరి, ఎందుకు..5 కోట్ల లోపు సినిమాలను తీయాలంటే మేకర్స్ ఆలోచిస్తున్నారు. 100 కోట్ల బడ్జెట్తో స్టార్ హీరోలు ఎందుకు సినిమాలను చేలేకపోతున్నారు.?


