వినియోగదారులకు మరోసారి షాక్ తగిలింది.ఊహించని విధంగా గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. ప్రతినెలా మొదటి వారంలో చమురు సంస్థలు ధరలను రివైజ్ చేస్తాయనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కమిర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ వినియోగదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
తాజా పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలపై ఆర్థిక భారం మరింత పడనుంది. పండుగల ఆర్డర్స్ వచ్చే సమయంలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై ఒక్కసారిగా రూ.62.50 పెంచారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.2,837.50కి చేరుకుంది. ఇక ముంబై నగరంలో రూ.2,764, చెన్నైలో రూ.2,983, బిహార్‌లోని పాట్నాలో రూ.3,100, హైదరాబాద్ నగరంలో రూ.3,065కి, విజయవాడలో 2,932.50, విశాఖపట్నంలో రూ.2,827.50కి ధరలు పలుకుతున్నాయి.
వివిధ నగరాల్లో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, రవాణా సదుపాయాలు, స్థానికంగా విధించే పన్నుల ఆధారంగా ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. దసరా, దీపావళి పండుగలు రానున్న నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడంతో ఆ ప్రభావం వినియోగదారుల మీద పడనుంది. మార్కెట్లో మొన్నటివరకు స్థిరంగా కొనసాగిన ఫుడ్ ఐటమ్స్ , టిఫిన్స్ ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇదిలాఉండగా,ఆయిల్ కంపెనీలు సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించాయి. ఇళ్లలో వినియోగించే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇవి యథావిధిగా కొనసాగనున్నాయి. హైదరాబాద్‌లో 14 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.994గా ఉంది. వ్యాపార రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారికి, హోటల్ నిర్వహణదారులకు ఈ ధరల పెరుగుదల అదనపు భారంగా మారనుంది. కాగా,గతంలో పలుమార్లు గ్యాస్ కొరత కారణంగా హోటల్స్‌లో ఫుడ్ ఐటమ్స్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.


