ఘోర విమాన ప్రమాదం సంభవించకుండా భారత పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే. దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమామాన్ని కూల్చివేసేందుకు యత్నించిన ఒమన్ దేశానికి చెందిన కో పైలట్ చర్యలను అడ్డుకుని 180 మంది ప్రాణాలను రక్షించాడు. బుధవారం ఫ్లై దుబాయ్ విమానం ఎఫ్‌జెడ్ 1073 దుబాయ్ నుండి టెల్ అవీవ్‌కు బయలుదేరింది.
ఈ క్రమంలోనే విమానం జొర్డాన్ గగనతలంలో ప్రయాణిస్తుండగా, కాక్‌పిట్‌లో ఉన్న కో పైలట్ ఆగ్రహంతో భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై కత్తితో దాడి చేశాడు. పలుమార్లు ముఖం, చేతులపై దాడికి పాల్పడటంతో పాటు విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ భారత పైలట్ అతడితో పోరాడాడు. విమానం కేవలం 30 సెకన్లలోనే 34వేల అడుగుల ఎత్తు నుండి 20,000 అడుగులకు వేగంగా పడిపోయింది.
విమాన సిబ్బంది వెంటనే కాక్‌పిట్‌లోకి ప్రవేశించి సాయం చేయడంతో విమానాన్ని మళ్లీ అదుపులోకి తీసుకొచ్చారు. అప్రమత్తమైన కెప్టెన్ స్మిత్ మచ్చార్ కో పైలట్‌ను అడ్డుకుని ఎమర్జెన్సీ మెసేజ్ పంపాడు. ఆ తర్వాత విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా దింపడంతో 180 మంది ఇజ్రాయెల్ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, గాయాలపాలైన స్మిత్‌కు అత్యవసర చికిత్స అందించడంతో పాటు దాడికి పాల్పడిన ఒమన్ పైలట్‌ను బంధించారు.
ఇజ్రాయెల్ ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌ను ప్యాసింజర్స్ ‘రియల్ హీరో’గా అభివర్ణించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా భారతీయ పైలట్ సాహసాన్ని అభినందించారు. భారత ప్రధాని మోడీ సైతం ఆయన్ను మెచ్చుకున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం రియల్ హీరో అని కొనియాడారు.
‘ధైర్యవంతుడైన మచ్చార్‌పై ఉగ్రవాది దాడి చేశాడు.అయినా ప్రాణాలకు తెగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పైలట్ పరిస్థితి విషమంగా ఉంది. అయినా అద్భుతమైన సమయస్పూర్తితో వ్యవహరించి ఒకరకంగా హీరోగా నిలిచారు. పైలట్‌పై దాడికి గల కారణం తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోంది. మచ్చార్ దాడి చేసిన కో పైలట్ బహుశా ఒక ఉగ్రవాది లేదా పిచ్చివాడు’ అని అభివర్ణించాడు.


