Power Usage: ఎల్ నినో పరిస్థితులు తీవ్రమైన ప్రభావమే చూపుతున్నాయి. ఎల్ నినో కారణంగా వర్షాకాలం కూడా వేసవి కాలాన్ని తలపిస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండల ధాటికి, తీవ్రమైన ఉక్కపోతకు జనం విలవిలలాడిపోతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రజలు కరెంటును భారీగా వినియోగిస్తున్నారు.
టెంపరేచర్లు పెరిగిపోవడం, తీవ్రమైన ఉక్కపోత నుంచి రిలీఫ్ కోసం ఇళ్లలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం గణనీయంగా పెరిగింది. మరోవైపు వానలు లేకపోవడంతో రైతులు బోర్ల మీద ఆధారపడుతున్నారు. వెరసి.. ఏపీ, తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగితే విద్యుత్ డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. సాధారణంగా వేసవి ప్రారంభానికి ముందు విద్యుత్ శాఖ సమ్మర్ యాక్షన్ ప్లాన్ ని అమలు చేస్తుంది. ఈసారి మాత్రం 6 నెలల ముందుగానే యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు.
ఆల్ టైమ్ రికార్డ్.. 19,892 మెగావాట్ల విద్యుత్ వినియోగం
తెలంగాణలో సాధారణంగా రోజూ సగటున 15వేల మెగావాట్ల వరకు విద్యుత్ డిమాండ్ ఉంది. బుధవారం రోజున మాత్రం కనీవిని ఎరుగని రీతిలో రికార్డ్ స్థాయిలో 19వేల 892 మెగా వాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గత ఏడాది అత్యధికంగా 16వేల 613 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డ్ అయ్యింది. ఈసారి మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ అని అధికారులు తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో వాతావణంలో మార్పులు జరిగి అన్ని రకాల సెక్టార్లలో కరెంటు వాడకం పెరిగిపోవడమే ఇందుకు కారణం. కాగా, విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుండటంతో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల కోసం టెండర్లు
భవిష్యత్తులో పెరగబోతున్న విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు 7వేల 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల కోసం టెండర్లు నిర్వహించాలని నిర్ణయించింది. 3వేల మెగా వాట్ల సోలార్, 4వేల మెగా వాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, 800 మెగా వాట్ల పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలపై క్యాబినెట్ చర్చించి ఆమోదించింది. కేంద్రం నిబంధనల మేరకు బిడ్డింగ్ విధానంలో ఈ ప్రాజెక్ట్ చేపట్టడానికి అనుమతి ఇచ్చింది. ఎల్ నినో ప్రభావం, పారిశ్రామిక వృద్ధి వల్ల రాబోయే రోజుల్లో కరెంటు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ ఏడాది గరిష్ట విద్యుత్ డిమాండ్ 20వేల మెగావాట్ల నుంచి 21వేల మెగా వాట్లకు చేరుకోవచ్చని అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే రబీ సీజన్, వేసవి కాలం అవసరాల కోసం విద్యుత్ సంస్థలు ఇప్పటికే సమ్మర్ యాక్షన్ ప్లాన్, దీర్ఘకాలిక వ్యూహాలను సిద్ధం చేశాయి.
సెప్టెంబర్ లోనే వేసవి స్థాయిని దాటిన విద్యుత్ డిమాండ్
అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి. అక్కడ కూడా విద్యుత్ డిమాండ్ పీక్స్ కు చేరింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోనే వేసవి స్థాయిని దాటి నమోదైంది. ఏకంగా 14వేల 600 మెగా వాట్లకు చేరింది. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, వేడి బాగా పెరగడం, ఉక్కపోత ఇందుకు ప్రధాన కారణాలు.
గతంతో పోలిస్తే 20శాతం మేర పెరిగిన వినియోగం
ఎన్ ఎల్ డీసీ గణాంకాల ప్రకారం సెప్టెంబర్ లో రాష్ట్రానికి రోజుకు సగటున 262 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరిగింది. గత ఏడాది సెప్టెంబర్ తో పోలిస్తే ఇది సుమారు 20శాతం ఎక్కువ. విద్యుత్ శాఖ అధికారుల వివరాల ప్రకారం రోజువారీ కరెంటు వినియోగం దాదాపు 280 నుంచి 290 మిలియన్ యూనిట్లకు మధ్య చేరింది. ఇది గతంతో పోలిస్తే దాదాపు 20శాతం మేర వినియోగం పెరిగింది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 10వ తేదీ నాటికి 298 మిలియన్ యూనిట్లకు విద్యుత్ వాడకం చేరడం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరా చరిత్రలోనే అత్యధికం. రోజుకి 298 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అనేది రికార్డ్ స్థాయిగా చెప్పాలి.
విద్యుత్ కొనుగోలుకు రోజుకు రూ.35కోట్లు ఖర్చు
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా విద్యుత్ కొనుగోళ్ల కోసం రోజుకు 28 కోట్ల నుంచి 35 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. భవిష్యత్ అవసరాల కోసం 1600 మెగా వాట్ల విద్యుత్ కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. రోజువారీ విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని బయటి నుంచి అత్యధిక ధరలకు విద్యుత్ కొని వినియోగదారులకు సరఫరా చేస్తున్న అసాధారణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి.


