తెలంగాణ

AmitShah: తెలంగాణపై బీజేపీ చాణక్యుడి గురి! అక్టోబర్ 4న రాష్ట్రానికి అమిత్ షా.. ఆ ఎన్నికలపైనే ఫోకస్!

5 నిమిషాల పఠనం

AmitShah: తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ అధిష్టానం సరికొత్త సమరానికి శంఖారావం పూరిస్తోంది. వరుస ఎన్నికల ముంగిట కమలం పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతుండగా, కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్ర వ్యూహకర్త అమిత్ షా అక్టోబర్ 4న రాష్ట్ర పర్యటనకు రానుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

AmitShah: తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ అధిష్టానం సరికొత్త సమరానికి శంఖారావం పూరిస్తోంది. వరుస ఎన్నికల ముంగిట కమలం పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతుండగా, కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్ర వ్యూహకర్త అమిత్ షా అక్టోబర్ 4న రాష్ట్ర పర్యటనకు రానుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పైకి ఇది సాధారణ అధికారిక, ప్రైవేట్ కార్యక్రమాల సందర్శనగానే కనిపిస్తున్నప్పటికీ, తెరవెనుక అసలైన పొలిటికల్ ఆపరేషన్‌కు షా శ్రీకారం చుడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది.

ముందున్నవి సాధారణ పరీక్షలు కావు

తెలంగాణలో రానున్న రోజులు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు సగానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకవైపు, త్వరలో రానున్న ఖైరతాబాద్ ఉపఎన్నిక మరోవైపు ముంచుకొస్తున్నాయి. వీటికితోడు గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) సహా వరంగల్, ఖమ్మం వంటి కీలక మున్సిపల్ కార్పొరేషన్ల పోరు కమలనాథుల ముందున్న పెను సవాళ్లు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఈ లోకల్ సమరాలే సెమీఫైనల్స్‌‌గా మారనున్నాయి. అందుకే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తుంది.

కొత్త టీమ్‌తో చాణక్యుడి మంతనాలు

ఇటీవలే రాష్ట్ర బీజేపీ సంస్థాగత కూర్పులో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నికల వ్యూహాల్లో దిట్ట అయిన సీనియర్ నేత సునీల్ బన్సల్‌ను తెలంగాణ వ్యవహారాల బాధ్యుడిగా నియమించడంతో పార్టీ శ్రేణుల్లో కదలిక మొదలైంది. ఈ నేపథ్యంలో స్వయంగా అమిత్ షా అడుగుపెడుతుండటంతో కొత్త టీమ్‌కు స్పష్టమైన రోడ్‌మ్యాప్ నిర్దేశించనున్నారని తెలుస్తుంది.

ప్రతి పోలింగ్ బూత్‌లో కమిటీల క్రియాశీలత, క్షేత్రస్థాయిలో అసంతృప్తి ఉన్న వర్గాలను కలుపుకుపోయే వ్యూహంపై నేతలకు క్లాస్ తీసుకోనున్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల ఆలోచనలకు అనుగుణంగా ప్రచారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీలోని సీనియర్లు, కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆఫీస్ బేరర్ల మధ్య పూర్తి సమన్వయం కుదిర్చి, గ్రూపు తగాదాలకు తావులేకుండా ముందుకు సాగేలా షా గట్టి హెచ్చరికలు జారీ చేసే అవకాశముందని చెబుతున్నారు.

తూప్రాన్ టూ కరీంనగర్.. అమిత్ షా పక్కా ప్లాన్

అధికారిక షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 4న తూప్రాన్ పరిధిలో కో-ఆపరేటివ్ సెక్టార్ డెయిరీ ప్రాజెక్టుకు భూమిపూజ చేసి, అనంతరం కరీంనగర్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే, ఈ పర్యటన సమయాన్ని పూర్తిగా వినియోగించుకుని కీలక నేతలతో రహస్య భేటీలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. అమిత్ షా పర్యటన ఖరారైతే క్యాడర్‌లో సరికొత్త ఉత్తేజం నిండటంతో పాటు, రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు గట్టి సవాల్ విసిరినట్లే అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ టూర్‌తో తెలంగాణ బీజేపీ ఎన్నికల గేర్ ఏ రేంజ్‌లో మారుతుందో వేచి చూడాలి.

#Amit Shah#Telangana BJP#BJP Telangana#Telangana Politics#Amit Shah Telangana Visit#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి