తెలంగాణ

Payal Shankar: అక్టోబర్ 21లోగా.. రేవంత్ సర్కార్‌కు బీజేపీ ఎమ్మెల్యే డెడ్‌లైన్..

5 నిమిషాల పఠనం

ఎల్ నినో ప్రభావంతో తెలంగాణ రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని రైతులను ఆదుకునే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు.

Payal Shankar: ఎల్ నినో ప్రభావంతో తెలంగాణ రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని రైతులను ఆదుకునే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు. ఇందుకు గాను అక్టోబర్ 21 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన డెడ్ లైన్ విధించారు. వచ్చే నెల 21వ తేదీ లోపు తెలంగాణలో ప్రధానమంత్రి పంటల బీమా అమలు చేయకపోతే 22వ తేదీ నుంచి బీజేపీ కిసాన్ మోర్చా నేతృత్వంలో ఆదిలాబాద్ కేంద్రంగా రైతు భరోసా యాత్ర చేపడతామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించారు. ఆదిలాబాద్ నుంచి రైతులతో కలిసి యాత్రగా వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామన్నారు.

ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన.. వెంటనే పీఎం ఫసల్ బీమా అమలు చేయాలని సీఎం రేవంత్ ను డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరిత్యాలతో పంటలు నష్టపోయి రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ వాపోయారు. అప్పులు చెల్లించాలంటూ బ్యాంకర్లు రైతుల ఇళ్లను జప్తు చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయడంతో పాటు రైతులకు తక్షణ ఆర్థిక భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

''అక్టోబర్ 21వ తేదీలోగా ప్రధానమంత్రి పంటల బీమా అమలు చేయకపోతే బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అక్టోబర్ 22వ తేదీ నుంచి ఆదిలాబాద్ నుండి వేలాది మంది రైతులతో యాత్ర ప్రారంభించి రాష్ట్ర రాజధానిలోని సెక్రటేరియట్ ముట్టడిస్తాం. తెలంగాణ రాష్ట్ర రైతులతో బీజేపీ మమేకమై ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కు రైతు యాత్ర ప్రారంభించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలు చేసే వరకు రైతులకు అండగా ఉండి బీజేపీ పోరాటం చేస్తుంది'' అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.

''కేరళం రాష్ట్రంలో సైతం అమలవుతున్న పంటల బీమా పథకాన్ని తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదు? గత పదేళ్లు రైతులను వంచించిన బీఆర్‌ఎస్‌.. రైతుల ఉసురు తగిలే అధికారాన్ని కోల్పోయింది. ప్రీమియం తామే చెల్లించి ఫసల్ బీమాను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేస్తోంది. తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేసుంటే సుమారు కోటి 30 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణానికి సంబంధించి ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.40 వేల చొప్పున వేల కోట్ల రూపాయల పంట నష్టపరిహారం నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యేది'' అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పారు.

#Payal Shankar#Telangana Bjp#Deadline#Pradhan Mantri Fasal Bima Yojana#Crop Insurance#Cm Revanth Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి