-ముందు టెసరాక్ట్ భూముల వ్యవహారం
-తర్వాత మెడికవర్ హాస్పిటల్స్ నిధుల అంశం
-ఇప్పుడు గీతా హ్యుందాయ్ షోరూమ్స్
-ఆ తర్వాత నైమిషా స్కూల్ అంశమేనా?
నేతల అవినీతి సామ్రాజ్యంపై జోరుగా చర్చ జరుగుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.మొన్నటివరకు బీఆర్ఎస్ నేతలు, కల్వకుంట్ల కుటుంబసభ్యుల అక్రమాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావులు గత పదేండ్లలో ఎంతమేర అక్రమాస్తులు సంపాదించారో అసెంబ్లీ వేదికగా చిట్టా విప్పారు.అధికారంలోకి రాక ముందు కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు ఎంత ఉన్నాయి? అధికారంలోకి వచ్చాక పదేండ్లలో ఎంతమేర పెరిగాయి అనే విషయాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు.
అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ భూముల లెక్కతేల్చాలని ల్యాండ్ సర్వేకు సీఎం రేవంత్ ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు భూముల లెక్క తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, సీఎం అసెంబ్లీలో చెప్పిన విధంగా మొత్తం 388 ఎకరాల ప్రభుత్వ భూమిలో 45 ఎకరాల లెక్క తేలలేదు. ఎర్రవల్లి శివారులోని సర్వే నంబర్ 325లో కేసీఆర్ కుటుంబసభ్యులకు భూములు ఉన్నాయి. అందులో సర్వేకోసం కేసీఆర్ ఫ్యామిలీకి నోటీసులు ఇచ్చి సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఆ 45 ఎకరాల భూమి ఎటుపోయింది? కేసీఆర్ కుటుంబసభ్యులు ఆ ల్యాండ్‌ను తమ భూమిలో కలిపేసుకున్నారా? అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేడో,రేపో అధికారులు నోటీసులు ఇచ్చి సర్వే చేశాక అసలు విషయం వెల్లడికానుంది.
బీఆర్ఎస్ ఎదురుదాడి..
సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను టార్గెట్ చేయడంతో బీఆర్ఎస్ పార్టీ సైతం ముఖ్యమంత్రి కుటుంబసభ్యుల ఆస్తులను టార్గెట్ చేసింది.అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి కుటుంబసభ్యుల ఆస్తులు ఎంతఉన్నాయి? సీఎం అయ్యాక ఆయిన ఈ మూడేండ్లలో ఆయన ఫ్యామిలీ ఎంత మేర పెరిగాయి? వారి అవినీతి సామ్రాజ్య చిట్టా విప్పి ప్రజల ముందు ఉంచేందుకు గులాబీ పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత మన్నెక్రిశాంక్ విడతల వారీగా నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల అక్రమ ఆస్తులు గురించి ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు.
టెస్సరాక్ట్ ల్యాండ్ ల్యాండ్ గోల్మాల్...
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి షాడోగా నడిపిస్తున్న‘టెస్సరాక్ట్’ డిఫెన్స్ కంపెనీ కోసం రూ.200 కోట్ల విలువైన ఫ్యూచర్ సిటీలోని భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.7 కోట్లకే కట్టబెట్టిందని బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తున్నది. టెస్సరాక్ట్ కంపెనీకి తానే సీఈవో అని కొండల్ రెడ్డి వెబ్ సైట్లో రాసుకొచ్చారని..అసలు విషయం వెలుగులోకి వచ్చాక తన పేరు తొలగించారని మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ఈ మేరకు నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ద్వారా ప్రచారం చేశారు. ఆ తర్వాత కేటీఆర్, హరీశ్ రావులతో కూడిన బీఆర్ఎస్ బృందం టెస్సరాక్ట్ కంపెనీకి కేటాయించిన భూమి వద్దకు వెళ్లి పోస్టర్లు ప్రదర్శించి మరి మీడియాకు వివరాలు వెల్లడించారు. సోదరుడి కంపెనీ కోసం సీఎం రేవంత్ రెడ్డి, అధికార యంత్రాంగం ఇజ్రాయెల్ కంపెనీతో సమావేశమై డీల్ కూడా కుదుర్చుకుందని బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపించింది.

మెడికవర్ షేర్స్ వ్యవహారం..
‘మెడికవర్’ హాస్పిటల్స్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలో సుమారు రూ.13,200 కోట్ల విలువ బెనిఫిట్ పొందారని బీఆర్ఎస్ నేత మన్నెక్రిశాంక్ ప్రధాన ఆరోపణ..ఈ లావాదేవీలో ₹13,000 కోట్ల బ్లాక్ మనీ వైట్‌గా మారిందని క్రిశాంక్ ఆరోపించారు. మెడికవర్, మ్యాక్స్‌బీన్ ఫార్మా మధ్య సంబంధాలు పరిశీలించాలని.. డాక్టర్ అన్నం శరత్‌రెడ్డి, గోలుగూరి సత్యనారాయణరెడ్డి తదితరుల షేర్ హోల్డింగ్, డైరెక్టర్ షిప్ మధ్యగల సంబంధాలను దర్యాప్తు చేయాలని ఈడీని కోరారు. రాష్ట్రంలో మెడికవర్ హాస్పిటల్స్ షేర్స్ బదలాయింపు, బ్లాక్ మనీని వైట్‌గా మార్చడంలో రేవంత్ ఫ్యామిలీకి సంబంధం ఉందని, సీఎం అల్లుడు పాత్రను పరిశీలించాలని క్రిశాంక్ ఆరోపించడం గమనార్హం. కాగా, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ దీనిపై స్పందిస్తూ.. రేవంత్ కుటుంబానికి మెడికవర్తో ఎలాంటి వ్యాపార సంబంధం లేదని, మెడికవర్ ముందే ఉన్న ప్రైవేట్ సంస్థ అని, తర్వాత విదేశీ సంస్థకు వాటా విక్రయించిందని క్లారిటీ ఇచ్చారు.

గీతా హ్యుందాయ్ వెనుక ఎవరున్నారు?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2024 ఆగస్టులో దక్షిణ కొరియాలో Hyundai ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.సుమారు 4 నెలల తర్వాత హైదరాబాద్‌లో 5 హ్యుందాయ్ షోరూమ్‌లు ప్రారంభమయ్యాయి. నార్సింగి, నాచారం, శంషాబాద్, వనస్థలిపురం, మెట్టుగూడ ప్రాంతాల్లో ఏర్పాటవ్వగా.. ఇందులో నిజమైన పెట్టుబడిదారులు ఎవరు?, పెట్టుబడి మూలం ఏమిటి?, బెనిఫిషియల్ ఓనర్స్ ఎవరు? అనే ప్రశ్నలను బీఆర్ఎస్ నేత మన్నెక్రిశాంక్ లేవనెత్తారు. సీఎం భార్య గీతా రెడ్డి ఇందులో భాగస్వామిగా ఉందని, ఆమె పేరు మీదనే ‘గీతా హ్యుందాయ్’ షోరూమ్స్ ఏర్పాటు అయ్యాయని ఆరోపించారు. హ్యుందాయ్ కంపెనీకి రేవంత్ సర్కార్ 675 ఎకరాలను కేటాయించారని.. ఈ ప్రాజెక్టు విలువ రూ.8,528 కోట్లుగా పేర్కొంటూ నగరంలోని పలు హ్యుందాయ్ షోరూమ్స్ ఎదుట తాజాగా ఫ్లెక్సీలు వెలిశాయి.
తర్వాత నైమిశా రెడ్డి స్కూల్ అంశమేనా?
MindVault సంస్థ కొంపల్లిలోని Survey No.87లో అంతర్జాతీయ స్థాయిలో స్కూల్ నిర్మాణం చేపడుతోంది. ఇందులో సీఎం కుమార్తె అనుముల నైమిషా రెడ్డికి షేర్స్ ఉన్నాయంటూ బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న‘యంగ్ ఇండియా స్కూల్స్’ వర్క్స్ ఆలస్యం అవుతున్నాయని.. కానీ, సీఎం కూతురు భాగస్వామిగా ఉన్న ప్రయివేట్ స్కూల్ శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోందని గులాబీ పార్టీ ఆరోపిస్తున్నది. ఈ స్కూల్ నిర్మాణం వ్యవహారంలో పురం సునీల్‌కుమార్ రెడ్డి ప్రతినిధిగా ఉన్నారని, దీనికి సంబంధించిన కంపెనీ/రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించినట్టు బీఆర్ఎస్ పేర్కొంది. దుంప శిరీషకు సీఎం కుటుంబంతో సంబంధం ఏంటో తేల్చాలని.. గీతా హ్యుందాయ్, MindVault సంస్థ, Medicover, Maxbien Pharma తదితర సంస్థలతోనూ ఆమెకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని మన్నె క్రిశాంక్ ఆరోపించారు.అధికారాన్ని అడ్డంపెట్టుకుని సీఎం కుటుంబం భారీగా అక్రమాస్తులు పోగెసుకుంటోందని బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తున్నది.


