సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి సిరిసిల్ల నియోజకవర్గానికి రానున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల, పొరుగు జిల్లా కరీంనగర్‌లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కిన క్రమంలో, సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానిక నేతలు, నిరసనకారుల నుంచి ఎదురయ్యే ఆందోళనలను కట్టడి చేసేందుకు రెండు జిల్లాల పరిధిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
భద్రతా పరంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సుమారు 1,600 మంది పోలీసు సిబ్బందిని మోహరించగా, కరీంనగర్ జిల్లా పరిధిలో మరో 550 మంది పోలీసులను బందోబస్తుకు కేటాయించారు. ఎస్పీల పర్యవేక్షణలో అదనపు ఎస్పీలు, డిఎస్పీలు, సీఐలు, పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ముఖ్యమంత్రి పర్యటించే మార్గాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ వేదికలు, బహిరంగ సభా ప్రాంగణాల వద్ద మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఇటీవల భూకబ్జా ఆరోపణలు, కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల, కాంగ్రెస్-బీఆర్‌ఎస్ నాయకుల మధ్య పెరిగిన విమర్శల దాడి నేపథ్యంలో ఈ పర్యటన అత్యంత ఉత్కంఠను రేపుతోంది. దీంతో సిరిసిల్లా పట్టణంలో ప్రధాన రహదారులు, కూడలి పాయింట్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సీఎం సభా ప్రాంగణంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ మెటల్ డిటెక్టర్లు, ఫ్రిస్కింగ్ ద్వారా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.
మరోవైపు, ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు, ఆందోళనకారులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. రూ. 345 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనుండగా, నేతన్నల సంక్షేమం, మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలపై ఆయన చేయనున్న ప్రకటనలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనను శాంతియుతంగా, దిగ్విజయంగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టింది.


