ఇండియాలోకి సముద్ర మార్గం గుండా డ్రగ్స్ తీసుకురావడానికి ప్రయత్నించిన దుండగులను కోస్ట్ గార్డు బలగాలు పట్టుకున్నాయి.దేశానికి పెద్ద ఎత్తున తీర ప్రాంతం ఉంది.అయితే, భారత్ మీద నిలువెల్లా విషం కక్కే పాకిస్తాన్.. సముద్ర జలాల గుండా, సరిహద్దు బోర్డర్స్ నుంచి మత్తుపదార్థాలను దేశంలోకి పంపుతోంది. ఇక బంగ్లాదేశ్ నుంచి కూడా పెద్దఎత్తున దేశంలోకి మత్తు పదార్థాలు వస్తున్నాయి.మనదేశంలోనే కొందరు వ్యాపారులు, నేతలు కాసులకు కక్కుర్తి పడి వాటిని దేశంలోనికి అనుమతించడంతో యువత మత్తుకు బానిసవుతోంది. ఫలితంగా నేరాలు, దారుణాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ భారీ ఆపరేషన్ చేపట్టి భారీగా మాదకద్రవ్యాలను పట్టుకుంది. వీటిని తరలిస్తున్న ముఠాను సైతం అదుపులోకి తీసుకుంది. లక్షద్వీప్ దీవులకు సమీపంలోని సముద్ర జలాల్లో అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.3 వేల కోట్లు పలికే భారీ డ్రగ్స్ కన్సైన్మెంట్ను అధికారులు విజయవంతంగా పట్టుకున్నారు.
ఇంజెలిజెన్స్ అందించిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్ నౌకలు అరేబియా సముద్రంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక ఇరాన్ బోటును వెంబడించి చుట్టుముట్టాయి. ఆ బోటును క్షుణ్ణంగా తనిఖీ చేయగా నిషేధిత 526 కిలోల హెరాయిన్, మెథాంఫేటమిన్ వంటి ప్రాణాంతక మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. ఐదుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకోగా వారంతా పాకిస్థాన్‌కు చెందిన వారికి అధికారులు గుర్తించారు.
జలమార్గం ద్వారా భారత్‌తో పాటు ఇతర దేశాలకు ఈ భారీ డ్రగ్స్‌ను చేరవేసేందుకు అంతర్జాతీయ స్మగ్లర్లు కుట్ర పన్నినట్టు భద్రతా దళాలు నిర్దారించాయి. పట్టుబడిన ఇరాన్ బోటు, ఐదుగురు పాకిస్థానీలను తదుపరి విచారణ నిమిత్తం సురక్షిత తీరానికి తరలించారు. ఈ మాదకద్రవ్యాల సరఫరా వెనుక ఉన్న అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా నెట్వర్క్ ఏది? ఎక్కడ ఉంది? వీటిని ఎక్కడికి చేరవేసేందుకు ప్లాన్ చేశారనే అంశాలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సహా ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు లోతైన విచారణ ప్రారంభించాయి. అలాగే, దేశ తీర ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్లు కోస్ట్ గార్డ్ ఉన్నతాధికారులు తెలిపారు.


