దేశరాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నీట్ పేపర్ లీకేజీ సమయంలో జరిగిన ఉద్రిక్తతలు మరోసారి రిపీట్ కాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలకమైన 11 మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ (రాకపోకల) గేట్లను తాత్కాలికంగా మూసివేసింది.
ఎన్నికల సంఘం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే మరోసారి దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నేడు గాంధీ జయంతి సందర్భంగా నిరసన చేపడతామని ముందే ప్రకటించారు. ఈ మేరకు యువత మరోసారి నడుం బిగించాలని కోరారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ఇతర శ్రేణులు సైతం జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనలకు పిలుపునిచ్చాయి.
ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 విధించి, భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి వేడుకలు కూడా ఉండటంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. గతంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా 11 మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. ప్రయాణికులు లోపలికి వెళ్లడానికి (Entry) లేదా బయటకు రావడానికి (Exit) పాయింట్లు క్లోజ్ చేశారు.
మూసివేసిన మెట్రో స్టేషన్స్ ఇవే..
రాజీవ్ చౌక్ (Rajiv Chowk), సెంట్రల్ సెక్రటేరియట్ (Central Secretariat),న్యూఢిల్లీ (New Delhi),మండి హౌస్ (Mandi House), పటేల్ చౌక్ (Patel Chowk), జన్‌పథ్ (Janpath), లోక్ కళ్యాణ్ మార్గ్ (Lok Kalyan Marg), ఐఎన్ఏ (INA),చౌరీ బజార్ (Chawri Bazar),రామకృష్ణ ఆశ్రమం మార్గ్ (Ramakrishna Ashram Marg), సేవా తీర్థ్ (Seva Teerth) స్టేషన్లు ప్రస్తుతం మూసివేసి ఉన్నాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఈ స్టేషన్లు తెరచుకోబడవని ఢిల్లీ మెట్రో అధికారులు పేర్కొన్నారు. ఫలితంగా ఆఫీసులు, కాలేజీలు, స్కూల్స్‌కు వెళ్లే ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది.ఇదిలాఉండాగా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేంత వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా శాంతియుతంగా నిరసన చేపట్టి తీరుతామని సీజేపీ ప్రతినిధులు స్పష్టంచేశారు.


