జాతీయం

Kedarnath: పుణ్యక్షేత్రాన్ని కాస్తా చెత్తకుప్పగా మార్చారు.. 5 నెలల్లోనే 135 శాతం పెరిగిన వ్యర్థాలు!

5 నిమిషాల పఠనం

Kedarnath: సముద్ర మట్టానికి దాదాపు 3,583 మీటర్ల ఎత్తులో కొలువైన పవిత్ర శైవక్షేత్రం కేదార్‌నాథ్ ఇప్పుడు తీవ్ర పర్యావరణ విలయంలో చిక్కుకుంది. పాండవుల కాలం నాటి ఘన చరిత్ర కలిగిన ఈ పుణ్యభూమికి ఏటా లక్షలాది మంది భక్తులు మోక్షం కోసం తరలివస్తుంటారు

Kedarnath: సముద్ర మట్టానికి దాదాపు 3,583 మీటర్ల ఎత్తులో కొలువైన పవిత్ర శైవక్షేత్రం కేదార్‌నాథ్ ఇప్పుడు తీవ్ర పర్యావరణ విలయంలో చిక్కుకుంది. పాండవుల కాలం నాటి ఘన చరిత్ర కలిగిన ఈ పుణ్యభూమికి ఏటా లక్షలాది మంది భక్తులు మోక్షం కోసం తరలివస్తుంటారు. అయితే, భక్తి ముసుగులో జరుగుతున్న విచ్చలవిడి కాలుష్యం హిమాలయాల ఉనికికే ముప్పు తెచ్చిపెడుతోంది. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే కేదార్‌నాథ్ కొండలు చెత్త దిబ్బలుగా మారిన భయానక వాస్తవం సమాచార హక్కు చట్టం ద్వారా తాజాగా బట్టబయలైంది.

గత రికార్డులను తుడిచిపెట్టేసిన వ్యర్థాల ప్రళయం

కేదార్‌నాథ్ నగర పంచాయతీ వెల్లడించిన అధికారిక గణాంకాలు పర్యావరణ ప్రేమికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేవలం ఐదు నెలల కాలంలోనే ఏకంగా 50.30 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. గత మూడేళ్ల వ్యర్థాల లెక్కలతో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది.

2023 ఏడాది మొత్తం వ్యర్థాలు 32.58 టన్నులు (ప్రస్తుత 5 నెలల చెత్తతో పోలిస్తే 54% ఎక్కువ). అలాగే 2024 మొత్తం నమోదైన వ్యర్థాలు 26.10 టన్నులు (ప్రస్తుతం 93% అధికం). ఇక 2025లో నమోదైన మొత్తం వ్యర్థాలు కేవలం 21.40 టన్నులు. అంటే గత ఏడాదితో పోల్చితే ఈ ఐదు నెలల్లోనే వ్యర్థాల పరిమాణం ఏకంగా 135 శాతం పెరిగిపోవడం గమనార్హం.

నెలవారీగా పరిశీలిస్తే.. ఏప్రిల్‌లో 1.7 టన్నులుగా ఉన్న వ్యర్థాలు, మే నెలలో యాత్రికుల తాకిడి పెరగడంతో ఒక్కసారిగా 16.3 టన్నులకు ఎగబాకాయి. జూన్‌లో 11.5 టన్నులు, జూలైలో 10.5 టన్నులు, ఆగస్టులో 10.33 టన్నుల చెత్త పోగుపడింది. ఈ మొత్తం వ్యర్థాల్లో దాదాపు 20 మెట్రిక్ టన్నులు ఒక్క ప్లాస్టిక్ వ్యర్థాలే ఉండటం గమనార్హం.

మందాకిని నదికి పొంచి ఉన్న ముప్పు..

అత్యంత సున్నితమైన పర్యావరణ వ్యవస్థ కలిగిన మందాకిని నదీ పరివాహక ప్రాంతంలో ఈ స్థాయిలో ల్యాండ్‌ఫిల్స్‌ను నింపడం పెను విపత్తుకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో ప్లాస్టిక్, చెత్త కుప్పల వల్ల భూగర్భ జలాలతో పాటు పవిత్ర మందాకిని నదీ జలాలు కలుషితమయ్యే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. కేవలం ఎంతమంది భక్తులు వచ్చారనే రికార్డులపై దృష్టి పెట్టడం కంటే.. అక్కడి వ్యర్థాల వేస్ట్ మేనేజ్మెంట్ కెపాసిటీ ఆధారంగానే యాత్రల నిర్వహణను పునఃసమీక్షించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

బద్రీనాథ్ మోడల్ ఎందుకు అమలు చేయలేరు?

మరోవైపు పొరుగునే ఉన్న బద్రీనాథ్ నగర పంచాయతీ వ్యర్థాల నిర్వహణలో ఆదర్శంగా నిలుస్తోంది. 2025 యాత్రా సీజన్‌లో బద్రీనాథ్ అధికారులు 230 టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి రూ.8.89 లక్షల ఆదాయాన్ని ఆర్జించారు. అందులో 133 టన్నుల పొడి చెత్త నుంచి బ్లాకులు తయారు చేయగా, 97 టన్నుల తడి వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువును ఉత్పత్తి చేశారు.

ఏప్రిల్ 22న కేదార్‌నాథ్ ద్వారాలు తెరిచినప్పటి నుంచి డోలీ యాత్రల వరకు భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ పవిత్ర హిమాలయ లోయలు ప్లాస్టిక్ మయం కాకముందే కఠినమైన పర్యావరణ నిబంధనలు అమలు చేయకపోతే.. ప్రకృతి ప్రకోపానికి మరోసారి మూల్యం చెల్లించుకోక తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

#Kedarnath#Kedarnath Temple#Kedarnath Yatra#Uttarakhand#Environmental Crisis#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి