క్రైమ్

Deer Meat: షాద్‌నగర్‌లో కృష్ణజింక మాంసం కలకలం.. 9మంది అరెస్ట్

5 నిమిషాల పఠనం

Deer Meat: కృష్ణ జింకను వేటాడి చంపి, దాని మాంసాన్ని ముక్కలుగా చేసి నగరానికి తరలిస్తున్న తొమ్మిది మంది సభ్యుల ముఠాను షాద్‌నగర్‌ పోలీసులు, ఎస్‌వోటీ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి లైసెన్స్‌డ్‌ తుపాకీ, బుల్లెట్లు, కృష్ణజింక మాంసం, రెండు కార్లు, నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో డీసీపీ శిరీష రాఘవేంద్ర కేసు వివరాలు వెల్లడించారు.

షాద్‌నగర్‌లో కృష్ణ జింక మాంసం పట్టివేత

జింకను వేటాడి చంపిన నిందితులు

పోలీసులు, ఎస్‌వోటీ, అటవీశాఖ అధికారుల జాయింట్ ఆపరేషన్‌

రాయకల్‌ టోల్‌ప్లాజా సమీపంలో వాహన తనిఖీలు

పోలీసుల అదుపులో 9మంది

Deer Meat: కృష్ణ జింకను వేటాడి చంపి, దాని మాంసాన్ని ముక్కలుగా చేసి నగరానికి తరలిస్తున్న తొమ్మిది మంది సభ్యుల ముఠాను షాద్‌నగర్‌ పోలీసులు, ఎస్‌వోటీ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి లైసెన్స్‌డ్‌ తుపాకీ, బుల్లెట్లు, కృష్ణజింక మాంసం, రెండు కార్లు, నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో డీసీపీ శిరీష రాఘవేంద్ర కేసు వివరాలు వెల్లడించారు.

మరికల్‌ అటవీ ప్రాంతంలో జింక వేట

సెప్టెంబర్‌ 26న అర్ధరాత్రి హైదరాబాద్‌కు చెందిన తొమ్మిది మంది వ్యక్తులు కార్లలో నారాయణపేట జిల్లా మరికల్‌ అటవీ ప్రాంతానికి వెళ్లారు. సెప్టెంబర్‌ 27న ఉదయం లైసెన్స్‌డ్‌ తుపాకీతో కృష్ణజింకను వేటాడి చంపారు. అనంతరం దాని మాంసాన్ని ముక్కలుగా నరికి ప్యాక్‌ చేసుకుని హైదరాబాద్‌ వైపు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాయకల్‌ టోల్‌ప్లాజా సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా నిందితుల ముఠా పట్టుబడింది. విచారణలో కృష్ణజింకను తామే వేటాడినట్లు నిందితులు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఎం.డి. హాజీ ఉద్దీన్‌ (36), మీర్‌ ముక్తార్‌ అలీ (37), ఎం.డి. తాజుముల్‌ (37), మీర్‌ రాజా అలీ ఖాన్‌ (39), ఖుర్రం ఖాన్‌ (35), సయ్యద్‌ సల్మాన్‌ అలీ (30), ఎం.డి. అఫ్రోజ్‌ ఖాన్‌ (36), ఎం.డి. అబ్దుల్‌ అజీజ్‌ (33), ఎం.డి. రియాజ్‌ (28) ఉన్నారు.

13 కిలోల జింక మాంసం స్వాధీనం

నిందితుల నుంచి .315 రైఫిల్‌, టెలిస్కోప్‌, సైలెన్సర్‌, 19 బుల్లెట్లు, సుమారు 13 కిలోల కృష్ణజింక మాంసం, స్కార్పియో, సుజుకి ఎస్‌-క్రాస్‌, 8 స్మార్ట్‌ఫోన్లు, రూ.28,590 నగదు, రెండు టార్చ్‌లైట్లు, క్యానన్‌ కెమెరా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972లోని 9, 39, 50, 51, 57 సెక్షన్లతో పాటు ఆర్మ్స్‌ యాక్ట్‌ సెక్షన్‌ 30 కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

వన్య ప్రాణుల వేట చట్టరిత్యా నేరం

వన్య ప్రాణులను వేటాడటం, చంపడం, వాటి మాంసాన్ని అక్రమంగా తరలించడం లేదా విక్రయించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని డీసీపీ శిరీష రాఘవేంద్ర హెచ్చరించారు. అక్రమ వేటకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వన్యప్రాణుల అక్రమ వేటకు సంబంధించిన సమాచారం తెలిస్తే అటవీశాఖ టోల్‌ఫ్రీ నంబర్లు 1800-425-5364, 040-23231440కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

#Deer Meat#Seized#Shadnagar#Swechaa News#Ranga Reddy Dist#Raykal Toll Plaza
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి