తెలంగాణ

Saroornagar: మాస్టర్‌ ప్లాన్‌నే మాయ చేసిన HMDA..ప్రభుత్వానికి దమ్ము లేదా?!..

6 నిమిషాల పఠనం

రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో వెలుగు చూసిన భారీ అవకతవకల గుట్టు గురించి వెలుగులోకి వచ్చిన నిజాలు ఈ వ్యవస్థను దోషిలా నిలబెడుతున్నాయి..

రాష్ట్రంలో మాయం అవుతున్న భూమి లెక్కలు చూస్తుంటే సామాన్యుడి గుండెలు పగిలిపోతున్నాయి.. ఇల్లు లేని వారికి ఉండటానికి కాస్త చోటు ఇవ్వడం లేదు. అలాగే పేదల ఇల్లు కూల్చుతున్నారనే ఆరోపణలున్న సమయంలో వేల కోట్ల భూములు యదేచ్ఛగా చేతులు మారడం ప్రభుత్వ, అధికారుల వైఫల్యాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది.

రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో వెలుగు చూసిన భారీ అవకతవకల గుట్టు గురించి వెలుగులోకి వచ్చిన నిజాలు ఈ వ్యవస్థను దోషిలా నిలబెడుతున్నాయి.. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు.. విక్రయానికి సిద్ధమైన మాస్టర్‌ ప్లాన్లు.. కానీ తీరా చూస్తే నిబంధనలన్నీ తుంగలో తొక్కేశారు.. స్వయంగా మాస్టర్ ప్లాన్ రూపొందించిన సంస్థే.. దానిని మాయం చేసి, ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి కొట్టడం చూస్తే.. ప్రభుత్వ ఆస్తులకు కాపలాగా ఉండాల్సిన అధికారులే.. అక్రమార్కులకు మార్గం సుగమం చేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ గ్రామం సర్వే నంబరు 9/1Pలోని 4,356 చదరపు అడుగుల ప్రభుత్వ స్థలాన్ని HMDA ఇటీవల ఆన్‌లైన్ ద్వారా వేలం వేసింది. చదరపు గజానికి కనీస ధర రూ.1.50 లక్షలుగా నిర్ణయిస్తే, వేలంలో నమోదైన గరిష్ఠ బిడ్ రూ.1.64 లక్షలు. ఈ ఒక్క భూమి అమ్మకం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.71.44 కోట్లు. పైకి చూస్తే ఇదో భారీ బిజినెస్ సక్సెస్ కథలా కనిపిస్తుంది.. కానీ దీని వెనుక దాగి ఉన్న అసలు మతలబు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఈ భూమికి తూర్పు వైపున సరూర్‌నగర్ రోడ్డు,ఉత్తరాన ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది. HMDA మాస్టర్ ప్లాన్-2030 ప్రకారం ఈ సరూర్‌నగర్ రోడ్డు వెడల్పు 100 అడుగులు. కానీ వేలం పత్రాల్లో మాత్రం దీనిని కేవలం 80 అడుగుల రోడ్డుగానే చూపించారు. 100 అడుగుల రోడ్డు ఉన్న వాణిజ్య ప్రాంగణానికి మార్కెట్లో ఉండే డిమాండే వేరు. అదే 80 అడుగులు అంటే స్థలం విలువ పడిపోతుంది. దీంతో బడా సంస్థలు పోటీలోకి రాకుండా వెనకడుగు వేశాయి. ఫలితంగా కనీస ధర కంటే కేవలం రూ.14 వేలు మాత్రమే అదనంగా పలికింది. నిజంగా 100 అడుగుల రోడ్డు అని డాక్యుమెంట్లలో స్పష్టంగా పేర్కొని ఉంటే, ఈ భూమి విలువ మరింత పెరిగేది.. ధరకు అమ్ముడై ప్రభుత్వానికి మరిన్ని కోట్ల ఆదాయం సమకూరేది..

ఇంత జరుగుతున్న ఇంకా అధికారులకు మత్తు వదలడం లేదనడానికి ఈ ఒక్క ఘటన మాత్రమే నిదర్శనం కాదు! ఈ మధ్య కాలంలో HMDA పరిధిలో ఇలాంటి అవకతవకలు నిత్యకృత్యంగా మారాయనే విమర్శలున్నాయి. కోకాపేట, మోకిల, ఉప్పల్, బాచుపల్లి వేలం పాటల్లోనూ డాక్యుమెంటేషన్‌లలో లోపాలు, మాస్టర్ ప్లాన్ రోడ్ల మళ్లింపులు, ఎఫ్‌టీఎల్ (FTL) పరిధి భూముల మార్పులతో పలు వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి..

ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ వేల కోట్ల విలువైన లేఅవుట్లలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా, కావాలని మాస్టర్ ప్లాన్‌లను మారుస్తూ, కొంతమంది బడా వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారంపై ఆన్‌లైన్ వేలం ఇన్‌ఛార్జ్ ని ప్రశ్నిస్తే.. మాస్టర్ ప్లాన్‌లో ఎన్ని అడుగుల రోడ్డు ఉందో నా వద్ద సమాచారం లేదు, ఉన్నతాధికారులను అడగండి అంటూ నీళ్లు నమలడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

మాస్టర్ ప్లాన్ వేసిన సంస్థే.. జరిగిన తప్పును ప్రశ్నిస్తే దాటవేసే వైఖరి ప్రదర్శించడం వెనుక ఎవరి హస్తం ఉంది? అనేది తేలాలంటే.. కోట్ల రూపాయల ప్రభుత్వ ధనానికి గండి కొడుతున్న ఈ అధికారుల నిర్లక్ష్యంపై, బాధ్యులపై ప్రభుత్వం తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే వాదన వినిపిస్తుంది.. లేదంటే ఇలాంటి అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వానికి దమ్ము లేదా?.. అనే విమర్శలు జోరుగా పుట్టే అవకాశాలున్నట్టు లోకం చెప్పుకొంటుందని అనుకొంటున్నారు!.. సంజాయిషీ ఇచ్చుకోవడం కాదు. సమస్యలకు పరిష్కారం చూపడమే నిజమైన పాలన అని అంటున్నారు..

#HMDA Land Auction#Saroornagar Land Scam#Master Plan Irregularities#Hyderabad Real Estate#Telangana Government Property#HMDA E-Auction Fraud#Land Valuation Scam#Saroornagar Survey No 9/1P
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి