Ap : ఏపీలో ప్రధాని మోడీ తల్లి పేరిట ఆలయం..!
ఏపీలో ప్రధాని నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ పేరిట ఆలయం నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం గుడికల్ (గుండికల్) గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 15న దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మాతా శ్రీ మందిరం చారిటబుల్ ట్రస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో హీరాబెన్ మోడీ స్మారకార్థం ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా, ఆలయ ప్రాంగణంలో శివుడు, దక్షిణమూర్తి, రాముడు, వినాయక ఆలయాలు, అనాథ శరణాలయం, గోశాలను సైతం నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఆలయ నిర్మాణ పనుల సమయంలో ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ నేతలతో పాటు జనసేన, వైసీపీ నాయకులు, గ్రామస్తులు పార్టీలకు అతీతంగా హాజరై మద్దతు తెలిపారు.త్వరలోనే నిర్మాణ పనులను పూర్తి చేసి భక్తులకు, సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని ట్రస్ట్ నిర్వాహకులు యోచిస్తున్నారు.
