అమిత్ షాకు దమ్ముంటే ఓవైసీపై పోటీ చేయాలి.. డీలిమిటేషన్ దక్షిణాది ప్రాధాన్యానికి గొడ్డలిపెట్టు
Cm Revanth: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నిజంగా ధైర్యం ఉంటే హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఓడించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేవలం హిందూ ముస్లిం ఓట్ల కోసం మాత్రమే మోడీ, అమిత్ షా.. అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అంతే తప్ప వారి మధ్య పెద్దగా ఏమీ పోటీ లేదని అన్నారు. కాంగ్రెస్ మాత్రం అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తోందన్నారు.
లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచితే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది అవసరం లేకుండా పోతుందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఉత్తరాది సీట్ల బలంతోనే అధికారం దక్కించుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డీలిమిటేషన్ తర్వాత మొత్తం 850 సీట్లలో ఉత్తరాదికి 650 సీట్లు, దక్షిణాదికి సుమారు 195 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ చర్య దక్షిణ భారత ప్రాధాన్యాన్ని తుడిచిపెట్టే కుట్ర అని ఆరోపించారు.
