ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం
Jupally Krishna Rao: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పేదల సంక్షేమం, ప్రజల ఆత్మగౌరవమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. కొల్లాపూర్ పట్టణంలో కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు మంత్రి జూపల్లి.
సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. సన్నబియ్యం పంపిణీ, సన్నాలకు బోనస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడుకున్నప్పటికీ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
