తెలంగాణ

Jupally Krishna Rao: ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం- మంత్రి జూపల్లి

5 నిమిషాల పఠనం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

* ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం

* ప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్‌లో చేరా

* పదవుల కోసం పార్టీ మారలేదు

* కొల్లాపూర్‌లో కొత్తగా 3,696 చేయూత పింఛన్లు

* లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి జూపల్లి

Jupally Krishna Rao: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పేదల సంక్షేమం, ప్రజల ఆత్మగౌరవమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. కొల్లాపూర్ పట్టణంలో కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు మంత్రి జూపల్లి.

సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. సన్నబియ్యం పంపిణీ, సన్నాలకు బోనస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడుకున్నప్పటికీ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.

నెలనెలా కొంత ఆర్థిక సాయం అందితే ఆత్మగౌరవంతో జీవించవచ్చని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వృద్ధులు, మహిళలు, అర్హులైన పేదలకు ఆసరాగా నిలిచేందుకు కొత్తగా చేయూత పింఛన్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో నూతనంగా 3,696 పింఛన్లు మంజూరయ్యాయని వెల్లడించారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్‌లో చేరా

తాను పార్టీలు మారానంటూ ఇటీవల ఓ నాయకుడు చేసిన విమర్శలపై జూపల్లి స్పందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది యువకులు ప్రాణత్యాగాలు చేశారని, వారి తల్లుల కడుపుకోత తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ ఆనాడు మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. అధికారం కోసం తాను పార్టీ మారలేదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీలో చేరానని వివరించారు.

గత పాలనలో రాష్ట్రానికి నష్టం

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని మంత్రి విమర్శించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ధారాదత్తం చేశారని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలా నియంతృత్వ పోకడలు కొనసాగాయని అన్నారు.

#Jupally Krishna Rao#Telangana Govt#Kollapur#Pensions#Cheyutha Pensions#Cm Revanth Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి