స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
Delimitation Bill 2026: జనాభా తగ్గితే రాజకీయంగా శాపమా?
డీలిమిటేషన్ పేరు వినగానే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ప్రశ్న మొదలవుతోంది. జనాభాను నియంత్రించినందుకు తమ రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోవాలా? జనాభా ఎక్కువగా పెరిగిన రాష్ట్రాలకు పార్లమెంట్లో ఎక్కువ సీట్లు వస్తే, జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోదా? ఈ ఆందోళనకు సమాధానం చెప్పే ప్రయత్నమే కేంద్రం తాజాగా ముందుకు తెచ్చిన 50 శాతం సీట్ల పెంపు ప్రతిపాదన. భారతదేశంలో రాష్ట్రాల మధ్య లోక్సభ స్థానాల కేటాయింపుపై చాలా కాలంగా పరిమితులు కొనసాగుతున్నాయి. జనాభా నియంత్రణ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని కొనసాగించే విధానం ఏర్పడింది.
