Congress : బహిరంగ విమర్శలొద్దు.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఏఐసీసీ ఇన్చార్జి వార్నింగ్!
అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి ఏఐసీసీ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి సందీప్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఇకమీదట ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం, పార్టీ మీద బహిరంగ విమర్శలు చేయరాదని సూచించినట్టు సమాచారం. అధికార పార్టీలో చోటుచేసుకున్న ప్రస్తుత పరిణామాలపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సందీప్ కుమార్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలిసింది.రెండ్రోజుల పర్యటన కోసం తెలంగాణకు విచ్చేసిన ఆయనను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. సుమారు గంటసేపు ఇద్దరి భేటీ జరిగినట్టు తెలిసింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు జరిగిన పరిణామాలను ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ఏఐసీసీ ఇన్చార్జి దృష్టి తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే, రాజ్ గోపాల్ రెడ్డి చెప్పిన విషయాలపై ఏఐసీసీ ఇన్చార్జి సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.
