తెలంగాణ

TG: సొంత శాఖ అధికారులైనా వదిలిపెట్టం.. మాజీ ఏడీఈ ఆరోపణలపై ఏసీబీ సంచలన ప్రకటన!

TG: తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చివరకు తమ సొంత శాఖ అధికారులైనా ఉపేక్షించబోమని తెలంగాణ ఏసీబీ తేల్చిచెప్పింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాజీ విద్యుత్ ఏడీఈ అంబేద్కర్, తన కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారిపైనే ఇటీవల ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. సొంత విభాగంలోని ఆఫీసర్‌పైనే కంప్లైంట్ రావడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, తెలంగాణ ఏసీబీ ఉన్నతాధికారులు తాజాగా ఈ కీలక ప్రకటన విడుదల చేశారు.ఏసీబీ సంస్థలో అవినీతిని ఏమాత్రం సహించబోమని, చట్టం ముందు అందరూ సమానమేనని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మాజీ ఏడీఈ అంబేద్కర్ ఇచ్చిన కంప్లైంట్‌ను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. దర్యాప్తు అధికారిపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా శాఖాపరమైన విచారణ జరుపుతామని వెల్లడించారు. ఒకవేళ విచారణలో సదరు అధికారిపై వచ్చిన ఆరోపణలు రుజువైతే, చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని కుండబద్దలు కొట్టారు.