రూ.20వేల కోట్లతో పట్టణాల అభివృద్ధి- సీఎం రేవంత్
Cm Revanth Reddy: రాష్ట్రంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పురపాలక శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాలను అభివృద్ధి చేసే ప్రణాళికలపై చర్చించారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబీ), జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకుతో పాటు దేశీయ ఆర్థిక సంస్థల సహకారంతో దాదాపు రూ.20వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టేందుకు పురపాలక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ
వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, వరంగల్ కోట కందకం పునరుద్ధరణ, హనుమకొండలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు, ప్రధానంగా టెక్స్టైల్ పార్కులకు వినియోగించడం ద్వారా మంచినీటి వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు అవకాశముంది.
