TBJP: ఎన్నికలు వచ్చినప్పుడు హడావుడి చేయడం, టికెట్ల కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం, ఆ తర్వాత హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో కూర్చొని టైంపాస్ చేయడం.. తెలంగాణ బీజేపీలో కొన్నేళ్లుగా పాతుకుపోయిన ఈ 'కంఫర్ట్ జోన్ బ్యాచ్'కి హైకమాండ్ ఫుల్‌స్టాప్ పెట్టే దిశగా పావులు కదుపుతోంది. పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుని క్షేత్రస్థాయిలో చెమటోడ్చే కార్యకర్తలు ఒకవైపు ఉంటే, ఎలాంటి క్రియాశీల సభ్యత్వం లేకుండా కేవలం పైరవీలు, పైరాయిటీలతో రాష్ట్ర స్థాయి పదవులు అనుభవిస్తున్న నేతలపై అధిష్టానం కన్నెర్ర చేసిందని తెలుస్తుంది. దీంతో రాష్ట్ర కాషాయ దళంలో ఉన్నట్టుండి తీవ్ర గుబులు మొదలైందని జోరుగా చర్చ నడుస్తుంది.
మేనేజ్‌మెంట్ కోటా నేతలకు ఫీజులు ఎగిరిపోయేలా వార్నింగ్!
తాజాగా జరిగిన రాష్ట్ర పదాధికారుల అంతర్గత భేటీలో అధిష్టానం దూతలు అభయ్ పాటిల్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ వ్యవహరించిన తీరు రాష్ట్ర నాయకులకు నిద్రపట్టకుండా చేస్తోందట. "ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క" అంటూ వాళ్లు నేరుగా ముఖం మీదే హెచ్చరికలు జారీ చేశారని చెబుతున్నారు. పార్టీ కోసం ప్రాణాలొడ్డి పోరాడేవారికే గుర్తింపు ఉంటుందని, మేనేజ్‌మెంట్ కోటాలు, రికమండేషన్లతో కుర్చీలు కాపాడుకుంటున్న వారి పదవులను ఊడగొట్టడం ఖాయమని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.
గతంలో ఢిల్లీ నుంచి నేతలు రావడం, విమానాశ్రయం నుంచి హోటల్‌కు వెళ్లి రివ్యూలు చేసి వెళ్లిపోవడం ఆనవాయితీగా ఉండేది. కానీ ఇప్పుడు ఇన్‌చార్జులు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాల్లో మకాం వేసి, ప్రతి నేత పనితీరును గ్రౌండ్ రియాలిటీతో బేరీజు వేయబోతున్నారు. "నన్ను ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అని చూశారు.. కానీ నేను ఇక్కడే ఉంటా, అంతా ప్రక్షాళన చేస్తా" అంటూ అభయ్ పాటిల్ ఇచ్చిన వార్నింగ్ పార్టీలో కంఫర్ట్ జోన్ బ్యాచ్‌కి గుబులు పుట్టించిందని అంటున్నారు.
జవాబుదారీతనం లేని పదవులకు చెక్ పడేనా?
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిటీలలో పార్టీ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా, ఫోటోలకు పోజులిచ్చేందుకే పరిమితమైన నేతల జాబితాను ఇప్పటికే హైకమాండ్ రెడీ చేసినట్లు సమాచారం. క్రియాశీల సభ్యత్వం లేని వారికి అప్పగించిన బాధ్యతలను వెనక్కి తీసుకోవడం, జిల్లా పర్యటనలు చేయకుండా, కార్యకర్తలకు అందుబాటులో ఉండని వారిని పక్కనపెట్టడం, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఓటు బ్యాంకును పెంచడంలో విఫలమైన వారికి ముగింపు పలకడం చేయబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలను హైకమాండ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
రాష్ట్రంలో అధికారం దిశగా అడుగులు వేయాలంటే నిర్లిప్తతను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న కేంద్ర నాయకత్వం, ఈసారి ఎంతటి వారినైనా పక్కన పెట్టేందుకు వెనుకాడబోమని సంకేతాలిచ్చింది. ఈ పరిణామాలతో పైరవీలతో పదవులు సంపాదించిన ఆ బ్యాచ్ ఇకనైనా క్షేత్రంలోకి దిగుతుందా.. లేక రాబోయే పునర్వ్యవస్థీకరణలో ఉద్వాసనకు గురవుతుందా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారింది.


