ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక అందించింది. పండుగ నేపథ్యంలో ముందుగా ప్రకటించిన విధంగా వారికి రెండు డీఏలు (కరువు భత్యం) మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1న జరిగిన మంత్రివర్గ సమావేశంలో రెండు డీఏలు చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.తాజాగా దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.
డీఏల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.2,500 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. పెరిగిన కరువు భత్యం జనవరి 2024 నుంచి అమలు కానుంది. మొత్తంగా డీఏను 37.31 శాతానికి రేవంత్ సర్కార్ పెంచింది. అలాగే 2015 పే స్కేల్ ఉద్యోగులకు డీఏను 81.72 శాతానికి, 2020 పే స్కేల్ ఉద్యోగులకు 40.04 శాతానికి, 2016 పే స్కేల్ ఉద్యోగులకు 53 శాతానికి, 2006 పే స్కేల్ ఉద్యోగులకు 246 శాతానికి పెంచుతూ జీవో జారీచేసింది.
యూజీసీ, ఏఐసీటీఈ పరిధిలోని ఉద్యోగులకు కూడా ఈ డీఏ పెంపు వర్తించనుంది. పెంచిన డీఏను అక్టోబర్ నెల జీతంతో కలిపి చెల్లించనున్నారు. నవంబర్ 1న ఉద్యోగుల ఖాతాల్లో పెరిగిన డీఏ జమ కానుంది. డీఏ బకాయిలను ప్రభుత్వం 33 వాయిదాల్లో చెల్లించనున్నట్టు సమాచారం.జులై 2024 డీఏ బకాయిలను 27 వాయిదాల్లో చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.
ఇదిలాఉండగా, ఉద్యోగులకు మొత్తం 5 డీఏలు చెల్లించాల్సి ఉండగా.. కేవలం రెండు డీఏల పెంపునకు ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మరో ఆరు నెలల వ్యవధిలో మరో డీఏను చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఇక పీఆర్సీకి సంబంధించిన నివేదికను ఈ ఏడాది చివరలోగా అందజేయాలని పీఆర్సీ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.నివేదిక రాగానే ఎంతమేర ఫిట్మెంట్ ఇస్తారనేది తెలియాల్సి ఉంది.


