తెలంగాణ రాజకీయాల్లో కొత్త లెక్కలు ఆసక్తి రేపుతున్నాయి. ఒకప్పుడు ఒకే రాజకీయ శిబిరంలో కనిపించిన నాయకులు ఇప్పుడు వేర్వేరు దారుల్లో నడుస్తున్నారు. కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. సామాజిక సమీకరణాల పేరుతో కొత్త నినాదాలు తెరపైకి వస్తున్నాయి. ఈ మొత్తం పరిణామంలో ఎవరి మాటకు ఎంత బలం ఉంది.. ఎవరి వెంట ఎంతమంది నడుస్తారు.. అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.
ఈ క్రమంలో కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రయాణం ప్రత్యేక చర్చకు కారణమవుతోంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె తన రాజకీయ వేదికను ప్రత్యేకంగా నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన రాజకీయ వ్యవస్థపైనే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ పాలన, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశాలపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ హిట్ పెంచుతున్నాయి.
పదేళ్లకు పైగా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. అదే కుటుంబానికి చెందిన కవిత.. ఇప్పుడు కేసీఆర్ రాజకీయ నిర్ణయాలను, బీఆర్ఎస్ వ్యవహారశైలిని ప్రశ్నిస్తున్నప్పుడు.. ప్రజలు ఆమె మాటలను కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా చూస్తారా? లేక గతంలో ఆమె కూడా అదే వ్యవస్థలో భాగమే కదా అని ప్రశ్నిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
బతుకమ్మ విషయంలో తనకు గతంలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న కవిత వ్యాఖ్యలు కూడా ఇదే కోణంలో చర్చకు వచ్చాయి. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బతుకమ్మకు అధికారికంగా లభించిన ప్రోత్సాహం, అప్పటి ప్రభుత్వ కార్యక్రమాలు, కవిత స్వయంగా నిర్వహించిన కార్యక్రమాలు.. ఇవన్నీ ఇప్పుడు ఆమె వ్యాఖ్యలతో పోల్చి చూస్తున్నారు.
కేసీఆర్పై ఆమె చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా గణేష్ నిమజ్జనం, కేసీఆర్ పాటలు, సినిమా వంటి సాంస్కృతిక అంశాలను రాజకీయ విమర్శల్లోకి తీసుకురావడం కొత్త చర్చకు దారితీసింది. ఒకప్పుడు కేసీఆర్తో కలిసి రాజకీయ వేదికపై కనిపించిన కవిత.. ఇప్పుడు అదే నాయకుడిపై విమర్శలు చేయడం సహజంగానే ఆసక్తిని పెంచుతోంది.
మరోవైపు తీన్మార్ మల్లన్న పాదయాత్ర కూడా తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. బీసీలకు రాజకీయ అధికారంలో తగిన వాటా ఉండాలన్న నినాదంతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. పాదయాత్రకు కనిపిస్తున్న స్పందన ఒక అంశం అయితే.. ఆ స్పందన ఎన్నికల్లో ఓట్లుగా మారుతుందా అనే ప్రశ్నలు పుడుతున్నాయి.
ఎందుకంటే తెలంగాణలో బీసీల జనాభా పెద్దదే అయినా.. బీసీ సమాజం అనేది ఒకే రాజకీయ బ్లాక్ కాదు. అందులో అనేక కులాలు, ప్రాంతాలు, స్థానిక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. అందరినీ ఒకే రాజకీయ వేదికపైకి తీసుకురావడం అంత సులభమైన విషయం కాదు. మల్లన్న రాజకీయంగా ఆ సమీకరణాన్ని ఎంతవరకు నిర్మించగలుగుతారన్నదే ఆయన ముందున్న సవాల్..
ఇక తెలంగాణలో కొత్త పార్టీలు పుట్టుకురావడం కూడా ఇదే రాజకీయ అసంతృప్తికి మరో సంకేతంగా చూడొచ్చు. రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణలో కొత్త నాయకత్వాలకు, కొత్త రాజకీయ వేదికలకు అవకాశం ఏర్పడింది. అదే సమయంలో ఇతర ప్రాంతాల్లో బలంగా ఉన్న పార్టీలు కూడా తెలంగాణలో తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నాయి.
అందుకే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు అధికార కాంగ్రెస్.. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రధాన రాజకీయ పార్టీలు తమ స్థానం కోసం పోరాడుతుంటే.. కొత్త పార్టీలు, కొత్త సామాజిక సమీకరణాలు ఆ ఓటు బ్యాంకుల్లో ఎంత మేరకు చీలిక తీసుకొస్తాయన్నది కీలకంగా మారుతోంది.
కవిత పార్టీ.. మల్లన్న రాజకీయ ప్రయోగం.. వీటిలో ఏది ఎంత బలపడుతుందన్నది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. పాదయాత్రకు వచ్చిన జనస్పందనను ఓట్లుగా లెక్కించలేం. అలాగే సోషల్ మీడియాలో కనిపించే చర్చను ప్రజాభిప్రాయంగా భావించలేం. ఎన్నికల సమయంలో బూత్ స్థాయిలో కనిపించే మద్దతే ఎవరి బలం ఎంతుందో తేల్చుతుందని రాజకీయ విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు..
అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో ఓటు చీలికకు కొత్త రాజకీయ వేదికలు కారణమయ్యే అవకాశం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది ఏ పార్టీకి లాభం.. ఏ పార్టీకి నష్టం అన్నది ఆయా నియోజకవర్గాల్లోని సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలం, స్థానిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
ఇక కవిత రాజకీయాల్లో ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఆరాటపడుతున్న నేపథ్యంలో.. మల్లన్న తన బీసీ నినాదాన్ని విస్తృత రాజకీయ శక్తిగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠంగా మారుతున్నాయి.. అందుకే ఇద్దరు ప్రజల్లోకి వెళ్ళి విమర్శల బాణాలు సంధిస్తున్నారు. కానీ ఆ ప్రజా స్పందనను స్థిరమైన ఓటు బ్యాంకుగా మార్చడం మాత్రం అంత తేలిక కాదనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది.
ప్రస్తుతం కవిత మాటలు జనాన్ని ఎంతలా ప్రభావితం చేస్తాయి. మల్లన్న పాదయాత్ర ఎంతటి ప్రభావం చూపుతుంది? కొత్త పార్టీలు ఎవరి ఓట్లు చీల్చుతాయన్నది ఉత్కంఠంగా మారింది. ఇక నాయకులు ఎన్ని కథలు చెప్పినా.. ఎన్ని మాటలు మాట్లాడినా.. చివరకు తెలంగాణ ఓటరు తన ఓటుతో ఎవరిని బలపరుస్తాడో అనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగవలసిందే..


