స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

AssemblySeats AP, Telangana: ఏపీకి 88.. తెలంగాణకు 60!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ మార్పుకు రంగం సిద్ధమవుతోందా? రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రతిపాదన అమల్లోకి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఏపీలో మరో 88 స్థానాలు, తెలంగాణలో మరో 60 స్థానాలు రావచ్చన్న అంచనాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

  • తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను మార్పులు

  • భారీగా పెరగనున్న లోక్ సభ, అసెంబ్లీ సీట్లు

  • కొత్త నాయకత్వానికీ అవకాశాల వెల్లువ

  • నియోజకవర్గాలు, రాజకీయ లెక్కలు కూడా సరికొత్తగా!

స్వేచ్ఛ న్యూస్, హైదరాబాద్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ మార్పుకు రంగం సిద్ధమవుతోందా? రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రతిపాదన అమల్లోకి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఏపీలో మరో 88 స్థానాలు, తెలంగాణలో మరో 60 స్థానాలు రావచ్చన్న అంచనాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటివరకు డీలిమిటేషన్ చర్చలో లోక్‌సభ స్థానాల పెంపే ప్రధాన అంశంగా కనిపించింది. కానీ కొత్త బిల్లులో రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను కూడా 50 శాతం పెంచాలని ప్రతిపాదించడం అసలు మార్పు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కూడా పడనుంది.

ఏపీలో 175 నుంచి 263కు?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలున్నాయి. కొత్త బిల్లులో ప్రతిపాదించిన 50 శాతం పెంపు లెక్కను వర్తింపజేస్తే ఈ సంఖ్య సుమారు 263కు చేరవచ్చు. అంటే దాదాపు 88 స్థానాలు అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 25 ఎంపీ స్థానాలు 50 శాతం పెంపు నమూనా ప్రకారం 38కు చేరవచ్చని అంచనా. అంటే పార్లమెంట్‌లో మరో 13 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇక తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం 119 స్థానాలున్నాయి. 50 శాతం పెంపు లెక్క ప్రకారం సుమారు 179 స్థానాలు రావచ్చు. అంటే మరో 60 స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 17 స్థానాలు 26కు చేరే అంచనా ఉంది. అంటే మరో 9 ఎంపీ స్థానాలు పెరగవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. 50 శాతం పెంపు లెక్క ప్రకారం సుమారు 442 స్థానాలకు చేరే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కూడా చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని హామీ ఇచ్చారు. అన్ని పార్టీలు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలవాలని కోరారు.

పునర్వ్యవస్థీకరణ చట్టం ఏం చెబుతోంది?

ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్థానాల పెంపు అంశం కొత్తది కాదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లోనే ఏపీ అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు పెంచే నిబంధన ఉంది. అయితే ఆ పెంపు ఇప్పటివరకు అమల్లోకి రాలేదు. ఈ పెంపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 నిబంధనలకు లోబడి ఉంటుంది. ఇప్పుడు కొత్త డీలిమిటేషన్ బిల్లులో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదన రావడంతో ఈ అంశం మరోసారి చర్చలోకి వచ్చింది.

కొత్త నియోజకవర్గాలు.. కొత్త రాజకీయ సమీకరణాలు

సీట్ల సంఖ్య పెరిగితే రాజకీయ పార్టీలకు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ప్రస్తుతం ఒకే నియోజకవర్గంగా ఉన్న ప్రాంతాలు విడిపోయే అవకాశం ఉంటుంది. జనాభా ఎక్కువగా పెరిగిన పట్టణ ప్రాంతాల్లో కొత్త నియోజకవర్గాలు ఏర్పడవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోనూ సరిహద్దులు మారవచ్చు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల రాజకీయ లెక్కలు మారతాయి. ఒక నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం రెండు నియోజకవర్గాలుగా విడిపోతే కొత్త అభ్యర్థుల ఎంపిక తప్పనిసరి కావచ్చు. ఇదే సమయంలో పార్టీలకు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. రాజకీయంగా ఎదిగేందుకు అవకాశాల కోసం ఎదురుచూసే యంగ్ జనరేషన్ కి ఈ పరిణామం ఒక మంచి అవకాశం. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కొత్త నాయకత్వం పుట్టుకొచ్చే అవకాశముంది.

మహిళా రిజర్వేషన్‌తో మరో మార్పు

ఈ సీట్ల పెంపు ప్రతిపాదన వెనుక మహిళా రిజర్వేషన్ కూడా కీలకంగా ఉంది. రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో పాటు మహిళలకు కేటాయించే స్థానాలను కూడా డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రాని మహిళా నాయకులకు కొత్త అవకాశాలు ఏర్పడవచ్చు. పార్టీల అభ్యర్థుల ఎంపికలోనూ మార్పులు రావచ్చు. అయితే ఈ మార్పులన్నీ ఒక్కసారిగా జరగవు. పార్లమెంట్ ఆమోదం, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు, నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్ కేటాయింపులు వంటి ప్రక్రియలు పూర్తవ్వాలి. తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరగడం ఒక పరిణామమైతే.. ఆ కొత్త స్థానాలపై రాజకీయ పార్టీలు ఎలా పట్టు సాధిస్తాయన్నది మరో పెద్ద ప్రశ్న. డీలిమిటేషన్ అమలైతే ఏపీ, తెలంగాణలో రాజకీయ పోటీ స్వరూపమే మారే అవకాశం ఉంది.

తర్వాత చదవండి