దేశవ్యాప్తంగా లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ఈ బిల్లులను సభ ముందుకు తీసుకురానుండగా, మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
1971 జనాభా లెక్కలు.. 50శాతం సీట్ల పెంపు
2029 లోక్సభ ఎన్నికల నాటికి కొత్త నియోజకవర్గాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న ఆందోళనలకు తెరదించేలా కేంద్రం కొత్త ఫార్ములాను రూపొందించింది. దీని ప్రకారం, అన్ని రాష్ట్రాల్లోనూ ప్రస్తుతమున్న నియోజకవర్గాల సంఖ్యను ఏకరీతిన 50 శాతం పెంచనున్నారు.
ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయాన్ని 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయిస్తారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల వాటా తగ్గకుండా, ఉత్తరాది రాష్ట్రాలతో సమానంగా నిష్పత్తి కొనసాగేలా ఈ ఏర్పాటు చేశారు. అయితే, రాష్ట్రాల పరిధిలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల సరిహద్దులను మాత్రం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఖరారు చేయనున్నారు.
మహిళా రిజర్వేషన్ల అమలు కోసమే..
ఈ తాజా ప్రతిపాదనతో 2027లో జరగాల్సిన జనాభా లెక్కలతో సంబంధం లేకుండానే పునర్విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని అమలు చేయాలంటే పునర్విభజన తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేస్తోంది. గతంలో పునర్విభజనతో సంబంధం లేకుండానే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేయగా, తాజా ఫార్ములాతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదన్న భరోసా లభించడంతో పలు పార్టీలు సానుకూలంగా స్పందిస్తున్నట్లు సమాచారం.
2029 ఎన్నికల నాటికి అమలు లక్ష్యం
ఈ ప్రక్రియ కోసం రాజ్యాంగంలోని ఎనిమిది అధికరణలను సవరించనుండగా, ఇందుకోసం మూడు కొత్త రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టి పాత రెండు బిల్లులను ఉపసంహరించుకోనున్నారు. ఆధునిక సాంకేతికత సాయంతో రెండేళ్లలోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి 2029 ఎన్నికల నాటికి అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళిక అమల్లోకి వస్తే లోక్సభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 850కి, రాష్ట్రాల శాసనసభల గరిష్ఠ సభ్యుల సంఖ్య 650కి చేరుకోనుంది.
