ఖైరతాబాద్ ఉపఎన్నికకు బ్రేక్?
ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన
ఎలక్షన్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక నిర్వహించబోము
హైకోర్టుకు తెలియజేసిన కేంద్ర ఎన్నికల సంఘం
బైపోల్ నోటిఫికేషన్ ఆపాలని విజయారెడ్డి లంచ్ మోషన్ పిటిషన్
దానం నాగేందర్ ఎన్నికపై వేసిన పాత పిటిషన్ పెండింగ్‌లో ఉందన్న విజయారెడ్డి
Khairatabad Bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నిక వ్యవహారంలో హైడ్రామా నడుస్తోంది. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు విజయారెడ్డి పిటిషన్, మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన. వెరసి ఖైరతాబాద్ బైపోల్ కు బ్రేక్ పడింది. న్యాయస్థానంలో ఎన్నికల పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున ఖైరతాబాద్ కు ఉపఎన్నిక ఇప్పుడే నిర్వహించబోమని తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇప్పట్లో జారీ చేయబోమని కోర్టుకు స్పష్టం చేసింది ఈసీ.
ఉపఎన్నిక నోటిఫికేషన్ నిలిపివేయాలని పిటిషన్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఈ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఖైరతాబాద్ స్థానానికి త్వరలో ఉపఎన్నిక ఖాయమని అంతా భావించారు. ఇందుకోసం ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
ఈ సమయంలో కాంగ్రెస్ నాయకురాలు, పీజేఆర్ కూతురు పి.విజయారెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. గతంలో తాను దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఖైరతాబాద్ కు ఉపఎన్నిక నిర్వహించడానికి వీల్లేదంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున, తుది తీర్పు వచ్చే వరకు తాము బైపోల్ నోటిఫికేషన్ ఇవ్వబోమని న్యాయస్థానానికి తెలియజేసింది.
విజయారెడ్డి పిటిషన్ పై హైకోర్టు విచారణ
ఖైరతాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఆపాలంటూ విజయారెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. 2024లో దానం నాగేందర్ పై తాను దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున.. ఖైరతాబాద్ స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. దీనిపై వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
దానం నాగేందర్ ఎన్నిక చెల్లదని పిటిషన్
2024 ఎన్నికల్లో దానం నాగేందర్ విజయాన్ని సవాల్ చేస్తూ విజయారెడ్డి హైకోర్టులో ఒక ఎలక్షన్ పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో దానం నాగేందర్ తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయన ఎన్నిక చెల్లదని, రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పాత పిటిషన్ పెండింగ్ లో ఉంది. దీనిపై తుది తీర్పు వచ్చాకే ఖైరతాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయాలని మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు విజయారెడ్డి. వాదనలు విన్న హైకోర్టు.. ఈ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులను (ఎలక్షన్ కమిషన్, దానం నాగేందర్) ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.


