* రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 7-8 గంటలు కూడా ఇవ్వలేకపోతోంది
* లో వోల్టేజ్ కారణంగా మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతూ రైతులపై ఆర్థిక భారం పడుతోంది
* గత ప్రభుత్వంలో రోలింగ్ స్టాక్ ఉంటే.. ఇప్పుడు కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లకు 3రోజులైనా ప్రత్యామ్నాయం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు
* సంవత్సర కాలంగా రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి
* మన రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంటే..
* రాజస్థాన్‌కు 800 మెగావాట్ల విద్యుత్ విక్రయించేందుకు ప్రభుత్వం ఎందుకు జాయింట్ వెంచర్ చేసుకుంది?
* వెంటనే రైతులకు నాణ్యమైన 20 గంటల కరెంట్, పెండింగ్ కనెక్షన్లు ఇవ్వాలి
* ట్రాన్స్‌ఫార్మర్లకు రోలింగ్ స్టాక్ ఏర్పాటు చేయాలి
* రేవంత్ సర్కార్‌కు హరీశ్ రావు డిమాండ్
Harish Rao: రేవంత్ సర్కార్ పై మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. మన రాష్ట్రంలో కరెంటు లేదు కానీ.. సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌కు అమ్ముతామని జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నారు? అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వకుండా పక్క రాష్ట్రానికి ఎందుకు అమ్ముతున్నారు? అని హరీశ్ రావు నిలదీశారు. మీరు చెప్పిందేమో 24 గంటల కరెంటు, కానీ ఇస్తున్నది కేవలం తొమ్మిది గంటలే. అందులోనూ మధ్యమధ్యలో ట్రిప్ అవుతోంది. మెటీరియల్ లేదనే సాకుతో రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను సంవత్సరకాలంగా పెండింగ్ లో పెట్టారు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
20గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వాలి
''మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే.. రైతులకు 20 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వాలి. ట్రాన్స్ ఫార్మర్లకు రోలింగ్ స్టాక్ పెట్టాలి. కాలిపోయిన వెంటనే కొత్తది ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న 2 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వెంటనే విడుదల చేయాలి. అన్ని జిల్లాల్లోని స్టోర్లలో వ్యవసాయ విద్యుత్‌కు అవసరమైన ఎక్విప్ మెంట్‌ను ప్రభుత్వం స్టాక్ మెయింటైన్ చేయాలి'' అని హరీశ్ రావు స్పష్టం చేశారు. నంగునూరు మండలంలోని పాలమాకుల, అక్కనేపల్లి, అంక్షాపూర్ గ్రామాల్లో హరీశ్ రావు పర్యటించారు. నర్మెట సబ్ స్టేషన్ సందర్శించారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలపై మీడియాతో మాట్లాడారు.
మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి
''నంగునూరు మండలంలో పర్యటించే క్రమంలో పాలమాకుల, అక్కనేపల్లి, అంక్షాపూర్ గ్రామాలకు వెళ్లాను. వెళ్లిన ప్రతి చోట లో వోల్టేజ్ తో మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయని రైతులు నాకు ఫిర్యాదు చేశారు. అసలు పరిస్థితి ఏంటని నర్మెట సబ్ స్టేషన్ కు వెళ్లి పరిశీలిస్తే.. ఏరోజు కూడా రైతులకు 10 గంటల కరెంటు కూడా రావడం లేదని.. కేవలం 7 నుంచి 8 గంటలు మాత్రమే వస్తోందని తేలింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటలకు బదులు 22 గంటలు వస్తేనే గగ్గోలు పెట్టి విమర్శలు చేసిన వాళ్లు.. ఈరోజు కేసీఆర్ ఇచ్చిన దాంట్లో సగం కరెంటు కూడా ఇవ్వలేకపోతున్నారు.
వారంలో 41 ట్రాన్స్‌ఫార్మర్లు, 200 మోటార్లు కాలిపోయాయి
అంక్షాపూర్ లో తన ఎనిమిది ఎకరాల పొలం కరెంటు లేక ఎండిపోతోందని ఎంతో బాధతో ఒక యువ రైతు నా దృష్టికి తీసుకొచ్చాడు. పాలమాకులలో మూడు రోజుల క్రితం ట్రాన్స్ ఫార్మర్ కాలిపోతే ఇప్పటికీ ఇవ్వలేదు. కరెంటు లేక పంటలు ఎండుతున్నాయని రైతులు వాపోయారు. నంగునూరులో 3, గట్లమల్యాలలో 2 ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయి మూడు రోజులైనా కొత్తవి ఇవ్వడం లేదు. ఒక్క నంగునూరు మండలంలోనే ఈ వారంలో 41 ట్రాన్స్ ఫార్మర్లు, 100 నుంచి 200 మోటార్లు కాలిపోయాయి.
రైతులపై ఆర్థిక భారం
సబ్ స్టేషన్ లో మేము చెక్ చేసినప్పుడు 11 KV లైన్ మీద 11.5 వోల్ట్స్ ఉండాల్సింది పోయి, కేవలం 10.5 వోల్ట్స్ మాత్రమే ఉంది. ఈ నాసిరకం లో వోల్టేజ్ కరెంటు వల్లే రైతుల మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయి. మోటార్ కాలిపోతే దాన్ని తీయడానికి, మళ్లీ ఫిట్ చేయడానికి, కాపర్ వైండింగ్ చార్జీలు అన్నీ కలిపి రైతుకు 10వేల రూపాయల ఆర్థిక భారం పడుతోంది. పైగా రెండు రోజుల పని ఖరాబ్ అవ్వడంతో పాటు పొలం ఎండిపోతోంది. ఇది పూర్తిగా చేతగాని ప్రభుత్వం, ఈ ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనం. ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి ఎందుకు దీని మీద రివ్యూ చేయడం లేదు?
ఈ ప్రభుత్వంలో రోలింగ్ స్టాక్ లేదు
ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ నెల కనెక్షన్లు ఆ నెలకే రిలీజ్ చేసేవాళ్లం. అప్పుడు 4,500 రూపాయలు ఉన్న డీడీ చార్జీలను ఈ కాంగ్రెస్ వాళ్లు 9వేల రూపాయలకు పెంచారు. అయినా డీడీలు కట్టిన రైతులకు కనెక్షన్లు ఇవ్వకుండా ఎదురుచూపులు చూసేలా చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 100 KV, 63 KV ట్రాన్స్ ఫార్మర్లను రోలింగ్ స్టాక్ లో ఉంచేవాళ్లం. కాలిపోగానే పాతది తీసుకుపోయి కొత్తది పెట్టేవాళ్లం. కానీ ఇప్పుడు కాలిపోయిన పాత దాన్ని తీసుకుపోయి, అది రిపేర్ అయ్యేదాకా మూడు రోజులు వెయిట్ చేయిస్తున్నారు, రోలింగ్ స్టాక్ లేదు. మూడు రోజులు ట్రాన్స్ ఫార్మర్ లేకపోతే రైతుల పంటలు ఏమవ్వాలి? మీ ఇంటెలిజెన్స్ కు ఇవేవీ కనబడటం లేదా?
రైతుల దగ్గరికి వస్తే నిజాలు తెలుస్తాయి
ముఖ్యమంత్రి గాలిలో తిరిగితే ఇవి ఎట్లా కనబడతాయి? నేల మీదకు వచ్చి రైతుల దగ్గరకు వస్తే వాస్తవాలు తెలుస్తాయి. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండి నీరు కిందికి జారడం లేదు. కాబట్టి లో-వోల్టేజ్ లేకుండా రాత్రి పూట కూడా కలుపుకుని కనీసం 20 గంటల కరెంటును రైతులకు ఇవ్వాలి. రాత్రి పూట కరెంటు ఇస్తేనే మా వెనుకమడి పారుతుందని, పొట్టకొచ్చిన పంట చేతికి వస్తుందని రైతులు అడుగుతున్నారు. అప్పట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కరెంటు రెండు గంటలు తగ్గితే.. లాగ్ బుక్కుల కోసం సబ్ స్టేషన్ల చుట్టూ ఉరికి ఉరికి తిరిగారు. ఇప్పుడు ఎనిమిది గంటలే వస్తుంటే ఎందుకు తిరగడం లేదు? ఆయనిప్పుడు కూడా లాగ్ బుక్కుల కోసం తిరగాలి'' అని హరీశ్ రావు అన్నారు.


