తెలంగాణ

TGSRTC : దసరా ‘స్పెషల్’ బాదుడు.. 6 రోజులు అదనపు చార్జీల వసూళ్లు!

4 నిమిషాల పఠనం

దసరా పండుగకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ మరోసారి బిగ్‌షాక్ ఇచ్చింది. ప్రత్యేక బస్సులు వేశామని నిన్న ప్రకటించిన ఆర్టీసీ..‘స్పెషల్’ పేరిట అదనపు చార్జీల వసూళ్లకు మరోసారి శ్రీకారం చుట్టింది.

దసరా పండుగకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ మరోసారి బిగ్‌షాక్ ఇచ్చింది. ప్రత్యేక బస్సులు వేశామని నిన్న ప్రకటించిన ఆర్టీసీ..‘స్పెషల్’ పేరిట అదనపు చార్జీల వసూళ్లకు మరోసారి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో పెద్ద పండుగలకు మాత్రమే అదనపు చార్జీలు వసూలు చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్న పండుగలకు కూడా అదనపు చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రభుత్వంలో రాఖీ, వినాయకచవితి పండుగలకు కూడా టీజీఎస్ ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేసింది. ఇప్పటికే బస్సులు చార్జీలు 50 శాతం మేర పెరిగాయి. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించి ఆ చార్జీలు కూడా తమ మీదే వసూలు చేస్తున్నారని పురుష ప్యాసింజర్స్ మండిపడుతున్నారు. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకు నిర్ణీత చార్జీలు వసూలు చేస్తుంటే.. ఎలక్ట్రిక్ బస్సులకు అదనంగా రూ.10 నుంచి 30 వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి.

ఇకపోతే ఈ దసరా పండుగకు ఊరెళ్లే ప్రయాణికుల జేబులకు చిల్లు పడటం ఖాయమని తెలుస్తోంది. సాధారణంగా ఏదైనా పండుగలు వస్తే సుమారు 10 నుంచి 20 శాతం అదనపు చార్జీలు వేయడం చూసి ఉంటాం.కానీ ఏకంగా 50 శాతం అదనపు చార్జీలు వేయడం ఏంటని ప్రయాణికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం చెబుతున్న సమాధానం వింతగా ఉంది. స్పెషల్ బస్సులు వెళ్లేటప్పుడు ఫుల్ రష్‌గా వెళ్తాయని వచ్చేటప్పుడు ఖాళీగా వస్తాయని అందుకే అదనపు చార్జీలు వసూలు చేస్తున్నామని చెబుతోంది.

ఇదిలాఉండగా, ఈసారి దసరా పండుగ సమయంలో 6 రోజుల పాటు అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు అదనపు చార్జీలు ఉంటాయని తెలిపింది. ఈసారి దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం 7 వేల వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు టీజీఎస్ఆర్టీసీ నిన్న ప్రకటించింది. అయితే, ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తామని తెలిపింది. మరల దసరా పండుగ అయిపోయాక తిరుగు ప్రయాణంలో రద్దీ ఉండే 25, 26 తేదీల్లోనూ 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది.

కాగా, ఒక్క కరీంనగర్ జోన్ నుంచే 3,533 ప్రత్యేక బస్సులు, హైదరాబాద్ జోన్ నుంచి 2,155 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. ప్రధాన రద్దీ ప్రాంతాలకు అదనపు సర్వీసులు నడుపుతామని పేర్కొంది.తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రత్యేక బస్సులకూ పెంచిన చార్జీలు వర్తిస్తాయని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టంచేసింది.

#TGSRTC#Special buses#dussera#Additional charges#Telangana#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి