ఫ్రెండ్స్‌తో రెస్టారెంట్‌కు వెళ్తున్నారా?
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా?
ఫైవ్‌స్టార్ హోటల్‌లో తింటున్నా గ్యారెంటీ లేదా?
వంటగదుల్లో లైవ్ కెమెరాల డిమాండ్..
అయినా మన ఆహారం సురక్షితమేనా?
హైదరాబాద్ హోటళ్లలో దారుణమైన పరిస్థితులు
ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లారు. ఆకలేస్తోంది. వెంటనే ఫోన్ తీసి ఫుడ్ యాప్ ఓపెన్ చేశారు. మంచి రేటింగ్ ఉన్న రెస్టారెంట్‌లో బిర్యానీ ఆర్డర్ చేశారు. ఫుడ్ వచ్చింది. వేడివేడి బిర్యానీ.. పక్కన చికెన్ పీస్‌లు.. మంచి సువాసన. ఇంకేముంది.. లాగించేయడమే! కానీ ఒక్కసారి ఆగండి. ఆ బిర్యానీ తయారైన వంటగదిలో ఏం జరిగింది? అందులో వాడిన మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? వంట చేసిన వ్యక్తి పరిశుభ్రత పాటించారా? ఆహార పదార్థాలు సరిగ్గా నిల్వ చేశారా? ఈ ప్రశ్నలు మీకు ఎప్పుడైనా వచ్చాయా?
బిర్యానీలో బొద్దింకలు.. బేకరీల్లో ఎలుకలు.. ఖరీదైన హోటళ్ల వంటగదుల్లోనూ అపరిశుభ్రత.. పండుగల సమయంలో స్వీట్లలో కల్తీ రంగులు.. ఇలా వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలు ఇప్పుడు బయట తినే ఆహారంపై అనుమానాలు పెంచుతున్నాయి. ఇంట్లో వంట చేసుకునే సమయం లేక బయట తినేవాళ్లు ఒకవైపు.. వీకెండ్ వచ్చిందంటే రెస్టారెంట్లలో గడిపే యువత మరోవైపు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలపై ఆధారపడుతున్న వాళ్లు ఇంకోవైపు.
వీళ్లందరికీ ఇప్పుడు ఒకటే ప్రశ్న. డబ్బులు పెట్టి కొనుక్కుని తింటున్న ఆహారమే అనారోగ్యాన్ని తెచ్చిపెడితే ఎలా? హోటల్‌లో తినాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు హైదరాబాద్ హోటళ్లకు ఏమైంది..?
ప్లేట్‌లో బిర్యానీ కనిపిస్తుంది.. మరి వంటగదిలో సీన్ ఏంటి?
మనకు రెస్టారెంట్ కనిపిస్తుంది. అందమైన ఇంటీరియర్ కనిపిస్తుంది. సిబ్బంది సర్వీస్ ఓకే. మెనూలో ఫుడ్ ఫొటోలు కనిపిస్తాయి. ఆన్‌లైన్‌లో ఫైవ్‌స్టార్ రేటింగులు అదిరిపోతాయి. కానీ మనం తినే ఆహారం తయారయ్యే వంటగది ఎలా ఉంది? అక్కడ పరిశుభ్రత ఉందా? ముడి పదార్థాల నాణ్యత ఎలా ఉంది? ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసం తాజాగా ఉందా? వాడుతున్న నూనె నాణ్యమైనదేనా? ఇవేవీ సాధారణ కస్టమర్‌కు తెలియవు.
కొన్ని హోటళ్లలో బయటకు కనిపించే హంగులు ఒకలా ఉంటే.. వంటగదిలో పరిస్థితులు మరోలా ఉండే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ఆహార తయారీ, నిల్వ, శుభ్రత విషయంలో నిర్లక్ష్యం జరిగితే దాని ప్రభావం నేరుగా కస్టమర్ ఆరోగ్యంపై పడుతుంది.
ఇక్కడే లైవ్ సీసీటీవీల ఆలోచన తెరపైకి వచ్చింది. హోటల్ వంటగదిలో కెమెరాలు ఏర్పాటు చేస్తే కస్టమర్లు వంట ప్రక్రియను చూడొచ్చని, హోటల్ యాజమాన్యాలపై బాధ్యత పెరుగుతుందని ఈ ప్రతిపాదనకు మద్దతు లభిస్తోంది. పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా వంటి ప్రముఖులు కూడా ఈ ఆలోచనకు మద్దతు పలికారు. కానీ కెమెరాలు పెట్టేస్తే సమస్య మొత్తం పరిష్కారమైపోతుందా?
లైవ్ కెమెరా ఉన్నా.. కల్తీని కనిపెట్టగలమా?
కెమెరాలు ఉన్నంత మాత్రాన.. కల్తీ కట్టడి అవుతుందా..? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. ప్రముఖ చెఫ్ వంశిక భాటియా లాంటి వారు చెబుతున్న అంశం ఇక్కడ కీలకం. లైవ్ స్ట్రీమింగ్ వల్ల పారదర్శకత పెరగొచ్చు. కానీ అది ఫుడ్ సేఫ్టీకి పూర్తి పరిష్కారం కాదు. ఒక చెఫ్ వంట చేస్తున్నప్పుడు గ్లౌజులు వేసుకున్నాడా? కిచెన్‌లో శుభ్రత పాటిస్తున్నారా? ఆహారాన్ని ఎలా తయారు చేస్తున్నారు? ఇవి కెమెరాలో కనిపించవచ్చు. కానీ వంటలో ఉపయోగిస్తున్న చికెన్ నాణ్యమైనదేనా? మాంసాన్ని ఎంతకాలంగా నిల్వ ఉంచారు? కూరగాయలు కలుషితమయ్యాయా? వంట నూనెను పదేపదే ఉపయోగిస్తున్నారా? ఆహార పదార్థాల గడువు ముగిసిందా? ఇవన్నీ కెమెరా చూసి చెప్పలేదు. ఇదే అసలు ట్విస్ట్.
మరింత ముఖ్యమైన విషయం.. కెమెరా ముందు వంటగదిని శుభ్రంగా ఉంచి, మిగతా ప్రాంతాల్లో నిర్లక్ష్యం చేస్తే ఏం చేయాలి? రాత్రిపూట ఫ్రిజ్‌లో సరైన ఉష్ణోగ్రతను నిర్వహిస్తున్నారా? ఉదయం వంట ప్రారంభించే ముందు కిచెన్‌ను పూర్తిగా శుభ్రం చేస్తున్నారా? ఇవన్నీ నిరంతర తనిఖీలతోనే బయటపడతాయి. అంటే కెమెరా ఒక నిఘా సాధనం మాత్రమే. నాణ్యతకు సర్టిఫికెట్ కాదు.
అసలు ప్రమాదం వంటలో కాదు.. నిల్వలోనూ ఉంది!
చాలామంది ఆహారం అపరిశుభ్రంగా ఉంటేనే అనారోగ్యం వస్తుందని భావిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో కంటికి కనిపించని బ్యాక్టీరియా కూడా తీవ్ర సమస్యలకు కారణమవుతుంది. పచ్చి మాంసం, చేపలు, సీఫుడ్‌ను వండిన ఆహారంతో కలిపి నిల్వ చేస్తే క్రాస్ కంటామినేషన్ జరిగే ప్రమాదం ఉంది. ఒకే కత్తి, కటింగ్ బోర్డును శుభ్రం చేయకుండా వేర్వేరు పదార్థాలకు ఉపయోగించినా బ్యాక్టీరియా వ్యాపించవచ్చు.
ఇక ఉష్ణోగ్రతల నియంత్రణ మరో పెద్ద సమస్య. వండిన ఆహారాన్ని ఎక్కువసేపు బయట ఉంచడం, ఫ్రిజ్‌లో సరైన కూలింగ్ లేకపోవడం, నిల్వ సామర్థ్యానికి మించి పదార్థాలను కుక్కేయడం వల్ల ఆహారం పాడయ్యే అవకాశం ఉంది. ఇక్కడే మరో ప్రమాదం ఉంది. మనం ఆర్డర్ చేసిన ఫుడ్ ఎంతసేపు నిల్వ ఉంది? ఎప్పుడు వండారు? ఎంతసేపు బయట ఉంచారు? డెలివరీకి ముందు సరైన ఉష్ణోగ్రతలో ఉంచారా? ఈ వివరాలు కస్టమర్‌కు సాధారణంగా తెలియవు. ఫుడ్ యాప్‌లో మంచి రేటింగ్ ఉండొచ్చు. ప్యాకింగ్ ఆకర్షణీయంగా ఉండొచ్చు. కానీ ఇవేవీ ఆహార భద్రతకు హామీ ఇవ్వవు.
ఫైవ్‌స్టార్ హోటల్ అంటే ఫుడ్ సేఫ్టీ గ్యారెంటీనా?
ఇది కూడా చాలామందిలో ఉండే అపోహ. ఖరీదైన హోటల్‌లో తింటున్నాం కాబట్టి ఆహారం తప్పకుండా నాణ్యమైనదే అనుకోవడం సరికాదు. హోటల్ స్థాయి, ధరలు, ఇంటీరియర్, బ్రాండ్ ఇమేజ్ ఒక అంశం. ఆహార భద్రత మరో అంశం. అలాగే చిన్న హోటల్‌లో తింటే తప్పనిసరిగా ప్రమాదమే అనుకోవాల్సిన అవసరం లేదు. అసలు చూడాల్సింది అక్కడ పాటిస్తున్న పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానాలు, స్టాఫ్ ట్రైనింగ్, భద్రతా ప్రమాణాలు.
కస్టమర్లకు వంటగది కనిపించేలా ఓపెన్ కిచెన్ ఏర్పాటు చేయడం కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ ప్రతి హోటల్‌లో అది సాధ్యం కాదు. పైగా వంటగది బయటకు కనిపించినంత మాత్రాన అక్కడ ఉపయోగిస్తున్న ప్రతి పదార్థం నాణ్యమైనదని నిర్ధారించలేం. అందుకే హోటళ్లపై క్రమం తప్పని తనిఖీలు, నిబంధనల ఉల్లంఘనపై చర్యలు, ఆహార నమూనాల పరీక్షలు అత్యంత అవసరం.
హోటల్‌కు వెళ్లే ముందు ఈ నాలుగు విషయాలు చెక్ చేయండి!
FSSAI లైసెన్స్ ఉందా?
హోటల్‌లో కనిపించే ప్రదేశంలో ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ వివరాలు ఉన్నాయో చూడండి. అవసరమైతే లైసెన్స్ నంబర్‌ను అధికారిక ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వ్యవస్థలో తనిఖీ చేయండి.
ప్యాకింగ్ చూసి మోసపోవద్దు!
స్వీట్లు, స్నాక్స్, కూల్‌డ్రింక్స్ కొనేటప్పుడు మ్యానుఫాక్చరింగ్ డేట్, ఎక్స్ పైరీ డేట్, పదార్థాల వివరాలు, అలర్జీ హెచ్చరికలు పరిశీలించండి.
ఆహారం ఎలా నిల్వ చేస్తున్నారు?
పాలు, మాంసం, సీఫుడ్ వంటి పదార్థాలను సరైన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేస్తున్నారా? వేడిగా ఉండాల్సిన ఆహారం తగినంత వేడిగా ఉందా? గమనించండి.
అనుమానం వస్తే తినకండి!
ఇది అన్నింటికంటే కీలకం. ఆహారం వాసన, రూపం, రుచిలో అసహజమైన మార్పు కనిపిస్తే తినడం ఆపేయండి. మేనేజ్ మెంట్ కి కంప్లైంట్ చేయండి. అవసరమైతే ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా సమాచారం ఇవ్వండి. గుర్తుంచుకోండి.. కలుషితమైన ఆహారాన్ని రుచి చూసి సురక్షితమో కాదో నిర్ధారించలేం.
తింటున్నామా.. ఆరోగ్యంతో రిస్క్ చేస్తున్నామా?
ఇప్పుడు బయట తినడం అనేది చాలామందికి లైఫ్ స్టైల్ లో భాగమైపోయింది. ఉద్యోగాల ఒత్తిడి, సమయం లేకపోవడం, ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి రావడం, కొత్త కొత్త రెస్టారెంట్లు, వైరల్ ఫుడ్ ట్రెండ్స్.. ఇవన్నీ బయట ఆహారంపై ఆధారపడే పరిస్థితిని పెంచాయి. కానీ ఒక విషయం మర్చిపోకూడదు. ఆకలి తీర్చుకోవడానికి ఆర్డర్ చేసిన ఫుడ్ మన ఆరోగ్యానికే సమస్యగా మారకూడదు.
హోటళ్లలో లైవ్ కెమెరాలు పెట్టాలా? కచ్చితంగా పారదర్శకత పెంచే మార్గంగా పరిశీలించవచ్చు. కానీ కెమెరాల కంటే ముఖ్యమైనది బాధ్యత. వంట చేసే వ్యక్తి నుంచి యాజమాన్యం వరకు ప్రతి ఒక్కరూ ఆహార భద్రతను ప్రాధాన్యంగా తీసుకోవాలి. ప్రభుత్వ తనిఖీలు కేవలం ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా నిరంతరం జరగాలి.
చివరగా ఒక్కసారి ఆలోచించండి. మనం తినే బిర్యానీ ధర ఎంత అని చూస్తున్నాం. కానీ అది ఎంత సురక్షితమో తెలుసుకుంటున్నామా? ఫుడ్ యాప్‌లో రేటింగ్ చూసి ఆర్డర్ చేస్తున్నాం. హోటల్ ఇంటీరియర్ చూసి టేబుల్ ఎంచుకుంటున్నాం. కానీ మన ప్లేట్‌లోకి వస్తున్న ఆహారం వెనుక ఉన్న అసలు కథ మాత్రం మనకు తెలియడం లేదు. ఇకనైనా హోటళ్లకు వెళ్లేటప్పుడు రుచి ఒక్కటే కాదు.. ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
ఇది ఒక్క హైదరాబాద్ కే పరిమితం కాలేదు. ప్రతి పట్టణం, నగరంలో ఇదే పరిస్థితి. పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే.. గ్రామీణ ప్రాంతాల్లోనే కాస్త పరిశుభ్రత పాటిస్తున్నారనే వాదనలూ వినిపిస్తున్నాయి. మరి పట్టణాల్లో కూడా ఆ పరిస్థితి రావాలి. జనం ధైర్యంగా హోటల్ కి వెళ్లి తినే రోజులు రావాలి. అప్పుడే అంతా హ్యాపీ...
