తెలంగాణ

HYD : హైదరాబాద్‌లో ఓటర్లను భయపెడుతున్న ఫారమ్-7..

4 నిమిషాల పఠనం

ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణలో కొనసాగుతుండగా.. ఓట్లను గుట్టుచప్పుడు కాకుండా తొలగిస్తున్నారని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోను కలిసి పలువురు నేతలు ఫిర్యాదు చేశారు.

ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణలో కొనసాగుతుండగా.. ఓట్లను గుట్టుచప్పుడు కాకుండా తొలగిస్తున్నారని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోను కలిసి పలువురు నేతలు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఓట్ల తొలగింపు ఆగడం లేదని, చిన్నచిన్నకారణాలు చూపుతూ తొలగిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో భాగంగా నోటీసులు అందుకున్న వారు సమాధానం ఇవ్వాల్సి ఉండగా, కొందరు ఇవ్వకపోవడంతో ఓట్లు డిలీట్ అవుతున్నాయని బీఎల్‌వోలు చెబుతున్నారు.

ఇదిలాఉండగా, హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. ఓటర్లకు తెలియకుండానే ఫారం-7 దరఖాస్తులు వెలుగుచూడటంతో ఆందోళన నెలకొంది. ఒక బీఎల్‌ఓ కుటుంబానికి చెందిన 30 ఓట్ల తొలగింపునకు ప్రయత్నించారని.. ఈ ఘటన ముషీరాబాద్‌లో వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది.

అయితే, అనుమానాస్పద ఫారం-7 దరఖాస్తులను అధికారులు తిరస్కరించినట్టు సమాచారం. ఓట్ల తొలగింపు ప్రయత్నంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలిసింది. ఫారం-7 దరఖాస్తులు ఎవరు సమర్పించారనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందగా.. బోగస్‌ దరఖాస్తులపై విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.

సాధారణంగా ఫారం-6 ద్వారా కొత్త ఓటర్ల నమోదు, ఫారం-8 ద్వారా చిరునామా మార్పు, పేర్లలో తప్పుల సవరణకు అవకాశం ఉంది. ఫలానా వ్యక్తి ఓటును తొలగించాలంటే ఫారం-7 ద్వారా దరఖాస్తు చేయాలి. ఆ ఓటరుపైన అనుమానం ఉన్నా, అది నకిలీ ఓటు లేదా డూప్లికేట్‌ ఓటు అని భావించినా, ఆ ఓటరు మృతి చెందినా, స్థానిక చిరునామాలో లేకపోయినా.. ఇలా వివిధ కారణాలతో ఫారం-7 ద్వారా ఫిర్యాదు చేయాలి. అధికారులు పరిశీలించి నిర్ధారించాకే ఆ ఓటరు పేరును జాబితా నుంచి తొలగిస్తారు. సాధారణంగా బీఎల్‌వోలకు ఇచ్చే ఈ ఫారాలు చేతిరాతతో నింపి ఉంటాయి. కానీ,, తొలగించాల్సిన ఓటరు వివరాలను ఫారం-7లో ప్రింట్‌ చేసి వాటిని కట్టలు కట్టలుగా తెచ్చి బీఎల్‌వోలకు ఇస్తుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఈ ప్రింట్స్ ఎవరు తెచ్చి ఇస్తున్నారు?అనే దానిపై పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం.

#Hyderabad#form-7#SIR#vote deletion#CEC#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి