తెలంగాణ సచివాలయం సమస్యలకు నిలయంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ పాలనా యంత్రాంగం అంతా ఇక్కడి నుంచే నడుస్తుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అధికారులు ఇక్కడి నుంచే అమలు చేస్తుంటారు.మంత్రులతో పాటు సీఎస్ సంజయ్ జాజు సైతం ఇక్కడి నుంచే విధులు నిర్వహిస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు ఇక్కడి నుంచి వెళ్తుంటాయి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సంస్థలకు బిల్లుల విడుదల, ఆర్థిక పరమైన అంశాలు సచివాలయం కేంద్రంగా నడుస్తుంటాయి.
దీనికి తోడు ప్రభుత్వ విధాన నిర్ణయాలు, పాలన, బడ్జెట్, చట్టాలు, పథకాలు, అధికారుల నియంత్రణ, జిల్లాల పర్యవేక్షణకు కేంద్ర స్థానంగా తెలంగాణ సచివాలయం ఉంది.కాగా, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్ ప్రకారం సచివాలయ స్థాయిలో సుమారు 33 ప్రధాన శాఖలు, వాటి పరిధిలో 289 సంస్థలు పనిచేస్తున్నాయి.అలాంటి హైఫై, నిత్యం హై సెక్యూరిటీ ఉండే ప్రాంతం నిత్యం సమస్యలకు వేదికగా మారుతోంది. దీంతో ఇదేం ప్రభుత్వం? ఇదేం పాలన? అంటూ విపక్షాలు అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
ప్రభుత్వ పాలనా యంత్రాంగం కొలువుదీరిన సచివాలయంలోని సమస్యలనే తీర్చలేని ప్రభుత్వం..ఇక ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తుందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇటీవలి కాలంలో సచివాలయంలో సమస్యలు నానాటికీ పెరుగుతున్నాయి. సచివాలయంలో నిత్యం బిల్లుల పెండింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. రెండు వారాల కిందట తమకు బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షన్ దారులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
తాజాగా సుమారు రూ.50 కోట్ల మేర వాటర్ బిల్లులు పెండింగ్ పెట్టారని సచివాలయంలో తాగునీటి సరఫరా నిలిపివేసినట్టు తెలిసింది. గతంలో ఫుడ్ బిల్లులు పెండింగ్ పెట్టారని.. భోజనం, స్నాక్స్ సైతం కాంట్రాక్టర్లు నిలిపివేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇంటర్నెట్ బిల్లులు పెండింగ్ పెట్టడంతో ‘నెట్’ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బిల్లులు నిలిపివేయడం వల్లే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, వారు సర్వీసు ఇవ్వడం ఆపేశారని ఉద్యోగులు సైతం పెదవి విరుస్తున్నారు.
ఇక తమకు 9 నెలలుగా జీతాలు లేవంటూ స్వీపర్లు సైతం ఆందోళన బాటపట్టారు. ఉద్యోగుల పీఎఫ్ క్లెయిమ్లు కూడా పెండింగ్ పెట్టడంతో బిల్లుల కోసం సచివాలయంలో రోజుకో నిరసన జరుగుతోంది. సీఎం, మంత్రులు, సీఎస్ ఉండే సచివాలయంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొంటే రాష్ట్రవ్యాప్తంగా పాలన ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. సచివాలయంలో నిరసనలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఇటీవల రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ అక్కడ పరిస్థితులు ఏమాత్రం మారలేదని తెలుస్తోంది.


