అక్టోబర్ 1న జరగాల్సి ఉన్న కేఆర్ఎంబీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆరోజున రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాల్సి ఉన్నందున కేఆర్‌ఎంబీ భేటీకి హాజరుకాలేని పరిస్థితి ఏర్పడింది. నీటిపారుదలశాఖ మంత్రి కేబినెట్ భేటీలో బిజీగా ఉండనున్నారు. అధికారులు సైతం ఆయనతో బిజీగా ఉండనుండటంతో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ENC) రమేశ్‌బాబు కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు అధికారికంగా లేఖ రాశారు.
అక్టోబర్ 1న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుండటంతో పలు కీలక పాలనాపరమైన అంశాలపై చర్చించాల్సి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేఆర్ఎంబీ సమావేశం వాయిదా పడింది.అయితే, తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాసినట్టు తెలుస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం అడ్డుకోవాలని, అక్టోబర్ 1వ తేదీన జరిగే కేఆర్ఎంబీ సమావేశం అజెండాలో ఈ అంశాన్ని చేర్చాలని కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అదే విధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, అచ్చంపేట ఎత్తిపోతల పథకం, మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం, జవహర్ నెట్టెంపాడు పథకంలోని రేలంపాడు రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించడం, గూడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడం, పులిచింతల బ్యాక్‌వాటర్‌పై నిర్మించనున్న రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం (బుద్ధమాధవరం), జాన్‌పహాడ్ ఎత్తిపోతల పథకం, బెట్టెతాండా ఎత్తిపోతల పథకం, నక్కగూడెం, ముక్త్యాల పథకాలను సైతం అడ్డుకోవాలని లేఖ రాసినట్టు తెలిసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా 811 టీఎంసీల కృష్ణా నదీ జలాల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు పంచుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరినట్టు సమాచారం. కాగా, ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై తెలంగాణ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గురువు చంద్రబాబు కోసమే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి న్యాయబద్ధంగా దక్కాల్సిన కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెడుతున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ ముందు నుంచి ఆరోపిస్తున్నది.


