దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. రేషన్ వ్యవస్థలోని నకిలీ, డూప్లికేట్, ఇన్-యాక్టివ్ ఉన్న లబ్ధిదారులను గుర్తించి తొలగించేందుకు ప్రభుత్వం ప్రక్షాళన చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోని దాదాపు 1.58 కోట్ల (15.8 మిలియన్లు) మంది లబ్ధిదారుల రేషన్ కేటాయింపులను అక్టోబర్ 1, 2026 నుంచి తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది.
కేంద్రం జారీ చేసిన కొత్త ప్రామాణిక నిర్వహణ విధానం (SOP) ప్రకారం.. గత ఆరు నెలలుగా ఆహార ధాన్యాలు తీసుకోని రేషన్ కార్డులను ‘సైలెంట్ రేషన్ కార్డులు’ (Silent Ration Cards) గా పరిగణిస్తారు. సవరించిన నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్డులను ముందుగా తాత్కాలికంగా డిసేబుల్ చేస్తాయి. అయితే, ఈ కార్డులను డేటాబేస్ నుంచి వెంటనే శాశ్వతంగా తొలగించరని, అర్హులైన లబ్ధిదారులకు తమ వివరాలు నిరూపించుకునేందుకు మూడు నెలల సమయం ఇస్తారని అధికారులు స్పష్టం చేశారు.
తాత్కాలికంగా సస్పెండ్ అయిన కార్డుదారులు ఈ మూడు నెలల కాలంలో ఇ-కేవైసీ (e-KYC) పూర్తి చేసుకుని, ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా తమ అర్హతను ధ్రువీకరించుకుంటే కార్డును తిరిగి యాక్టివేట్ చేస్తారు. కేంద్ర ఆహార శాఖ సెప్టెంబర్ 1, 2026న రాష్ట్రాల ఆహార కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. అర్హులకే లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఈ కఠిన నిబంధనలు అమల్లోకి తెస్తున్నారు.
నిష్క్రియాత్మకంగా ఉన్న కార్డులను తొలగించడం ద్వారా లబ్ధిదారుల డేటాబేస్ను పక్కాగా నిర్వహించవచ్చని భావిస్తున్నారు. అలాగే, అర్హులైన నిజమైన పేదలకే ప్రభుత్వ ఆహార ధాన్యాలు అందేలా చూడటమే ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజలు తమ ఇ-కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


