దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఫారమ్-6లో ఏకపక్షంగా మార్పులు చేసి కేంద్రంలోని మోడీ సర్కారుకు మేలు జరిగేలా సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలు తీసుకున్నారని.. అందుకే ఆయన రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై తెలంగాణ సీఈవో సుదర్శన్ రెడ్డి స్పందించారు.
రాహుల్ గాంధీ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సీఈవో తెలంగాణ ‘ఫ్యాక్ట్‌చెక్’లో స్పష్టంచేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి మేలు చేసేందుకు చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా ఓటర్ల నమోదు దరఖాస్తు 'ఫామ్-6'లో నిబంధనలను మార్చారంటూ రాహుల్ ఇటీవల 'ఎక్స్' వేదికగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

రాహుల్ గాంధీ చేసిన పోస్టును తోసిపుచ్చిన సీఈవో.. ఫారమ్-6 డిక్లరేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ప్రతి నిర్ణయం కమిషన్ పూర్తి ఆమోదంతో పాటు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు లోబడే జరిగిందని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. బిహార్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం 2025 జూన్ 24న జారీచేసిన ఆదేశాలను ఎన్నికల సంఘం సభ్యులు అందరి ఏకగ్రీవ ఆమోదంతోనే అమలు చేసిందన్నారు.ఈ ఉత్తర్వులను సుప్రీం కోర్టు తన 2026 మే 27 నాటి తీర్పులో సమర్థించిందని ఫ్యాక్ట్‌చెక్‌లో వివరించారు.
ఇక ఈసీఐ -2026 సెప్టెంబర్ 26న విడుదల చేసిన ప్రెస్ నోట్ (నం.120)లోని పాయింట్ 1(iii)లో కూడా.. "ఎస్ఐఆర్ కోసం ఫామ్-6తో జతపరిచిన డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది’ అని స్పష్టంగా పేర్కొన్నదని రుజువులను చూపించారు. రాజ్యాంగబద్ధ సంస్థల నిర్ణయాలపై ఆధారాలు లేని రాజకీయ ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించడం సరికాదని ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.


