IPS Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు.. ఏ2 ఎవరంటే?
మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొని అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసు (Trainee IPS Uday Krishna Reddy) విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టు అవ్వకుండా ఉండేందుకు ట్రైనీ ఐపీఎస్ సోదరుడు సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే ట్రైనీ ఐపీఎస్ తమ్ముడు ప్రణయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రధాన నిందితుడిగా (ఏ1) చేర్చిన దర్యాప్తు అధికారులు, తాజాగా ప్రణయ్‌ను ఏ2 కింద ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేశారు. పోలీసుల విచారణలో ప్రణయ్ కృష్ణారెడ్డికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేయగా ఆయన రాసిన సూసైడ్ నోట్‌ను ప్రణయ్ ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టినట్టు పోలీసులు గుర్తించారు.
