Aarogya Sri : ర్యాపిడో డ్రైవర్లుగా మారిన ఆరోగ్యశ్రీ ఉద్యోగులు
రాష్ట్రంలోని ఆరోగ్య శ్రీ ఉద్యోగులు ర్యాపిడో డ్రైవర్లుగా మారినట్టు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి వేతనాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకునేందుకు ర్యాపిడో డ్రైవర్ అవతారం ఎత్తినట్టు చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న సుమారు 800 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు వేతనకష్టాలు ఎదుర్కొంటున్నారని, ఏడాదిగా జీతాలు రాక కుటుంబ పోషణ భారమై ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నట్టు సమాచారం.కొన్ని జిల్లాల్లో 11 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. పేట్లబురుజులో 6 నెలలు, కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో 4 నెలలుగా జీతాలు చెల్లించకుండా పెండింగులో పెట్టినట్టు తెలిసింది.దీంతో స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు చెల్లించలేక ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబాలను పోషించుకునేందుకు డ్యూటీ తర్వాత ఉద్యోగులు ర్యాపిడో రైడర్లుగా పనిచేస్తున్నట్టు తెలిసింది.
