రాష్ట్రంలోని ఆరోగ్య శ్రీ ఉద్యోగులు ర్యాపిడో డ్రైవర్లుగా మారినట్టు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి వేతనాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకునేందుకు ర్యాపిడో డ్రైవర్ అవతారం ఎత్తినట్టు చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న సుమారు 800 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు వేతనకష్టాలు ఎదుర్కొంటున్నారని, ఏడాదిగా జీతాలు రాక కుటుంబ పోషణ భారమై ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నట్టు సమాచారం.
కొన్ని జిల్లాల్లో 11 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. పేట్లబురుజులో 6 నెలలు, కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో 4 నెలలుగా జీతాలు చెల్లించకుండా పెండింగులో పెట్టినట్టు తెలిసింది.దీంతో స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు చెల్లించలేక ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబాలను పోషించుకునేందుకు డ్యూటీ తర్వాత ఉద్యోగులు ర్యాపిడో రైడర్లుగా పనిచేస్తున్నట్టు తెలిసింది.
అయితే, పెండింగులో ఉన్న జీతాలు చెల్లించాలని ఆరోగ్యశాఖ మంత్రి, డీఎంఈ, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు ఇప్పటికే పలుమార్లు ఉద్యోగులు వినతులు సమర్పించినట్టు తెలిసింది. అయినా స్పందన లేదని ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.లేదంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆరోగ్య శ్రీ డేటా ఎంట్రీ ఉద్యోగులు వాపోతున్నారు.
మరోవైపు, ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు జీతాలు బకాయిలు ఉన్నాయన్న ఆరోపణలను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ ఖండించారు. ట్రస్ట్ ఉద్యోగులకు వేతనాలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని, ఎటువంటి బకాయిలు లేవని ఆయన స్పష్టంచేశారు.కాగా, కొన్ని చోట్ల ఔట్సోర్సింగ్ ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల కాంట్రాక్ట్ సిబ్బందికి జీతాలు అందడంలో జాప్యం జరుగుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
