చిత్రం లేదు
ఏపీ

AP Local Body Elections: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వింత పోకడ! సేవ కోసమా? రియల్ ఎస్టేట్ దందా కోసమా?

AP Local Body Elections: రాజకీయాలు ఎప్పుడో వ్యాపారంగా మారిపోయాయి. పదవుల కోసం బేరసారాలు, పైరవీలు సర్వసాధారణం అయిపోయాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో పరిస్థితి మరో మెట్టు దిగజారి, ఏకంగా బహిరంగ వేలం పాటల దాకా వెళ్లింది. ఒకప్పుడు ‘ఏకగ్రీవం’ అంటే గ్రామస్తులంతా ఒక్కతాటిపైకి వచ్చి, ఎలాంటి గొడవలు, విభేదాలు లేకుండా ఊరి అభివృద్ధి కోసం సమర్థుడైన వ్యక్తిని ఎన్నుకోవడం. కానీ నేడు కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం అనే మాటకు అర్థమే మారిపోయింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కనపెట్టి, సర్పంచ్ పీఠాలకు కోట్ల రూపాయల ధర కడుతూ ప్రజాస్వామ్యాన్నే వేలం వేస్తున్నారు.ముఖ్యంగా పట్టణాలకు ఆనుకుని ఉన్న గ్రామాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న ప్రాంతాల్లో సర్పంచ్ పదవులకు డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. విజయనగరం జిల్లా, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పరిసర గ్రామాల్లో ఇప్పుడు నడుస్తున్న రాజకీయం ఇందుకు నిదర్శనం. ఎయిర్‌పోర్ట్ రాకతో ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో ఆయా పంచాయతీలను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు కొందరు కోట్లు కుమ్మరించడానికి సిద్ధమయ్యారు.