ఏపీ

AP Local Body Elections: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వింత పోకడ! సేవ కోసమా? రియల్ ఎస్టేట్ దందా కోసమా?

AP Local Body Elections: రాజకీయాలు ఎప్పుడో వ్యాపారంగా మారిపోయాయి. పదవుల కోసం బేరసారాలు, పైరవీలు సర్వసాధారణం అయిపోయాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో పరిస్థితి మరో మెట్టు దిగజారి, ఏకంగా బహిరంగ వేలం పాటల దాకా వెళ్లింది.

AP Local Body Elections: రాజకీయాలు ఎప్పుడో వ్యాపారంగా మారిపోయాయి. పదవుల కోసం బేరసారాలు, పైరవీలు సర్వసాధారణం అయిపోయాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో పరిస్థితి మరో మెట్టు దిగజారి, ఏకంగా బహిరంగ వేలం పాటల దాకా వెళ్లింది. ఒకప్పుడు ‘ఏకగ్రీవం’ అంటే గ్రామస్తులంతా ఒక్కతాటిపైకి వచ్చి, ఎలాంటి గొడవలు, విభేదాలు లేకుండా ఊరి అభివృద్ధి కోసం సమర్థుడైన వ్యక్తిని ఎన్నుకోవడం. కానీ నేడు కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం అనే మాటకు అర్థమే మారిపోయింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కనపెట్టి, సర్పంచ్ పీఠాలకు కోట్ల రూపాయల ధర కడుతూ ప్రజాస్వామ్యాన్నే వేలం వేస్తున్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఎఫెక్ట్.. కోట్లు పలుకుతున్న సర్పంచ్ సీట్లు!

ముఖ్యంగా పట్టణాలకు ఆనుకుని ఉన్న గ్రామాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న ప్రాంతాల్లో సర్పంచ్ పదవులకు డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. విజయనగరం జిల్లా, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పరిసర గ్రామాల్లో ఇప్పుడు నడుస్తున్న రాజకీయం ఇందుకు నిదర్శనం. ఎయిర్‌పోర్ట్ రాకతో ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో ఆయా పంచాయతీలను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు కొందరు కోట్లు కుమ్మరించడానికి సిద్ధమయ్యారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ఆనుకుని ఉన్న బైరెడ్డిపాలెం గ్రామంలో సర్పంచ్ పదవి ధర ఏకంగా కోటిన్నర రూపాయలకు చేరినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ సరసయ్యమ్మ అనే మహిళ పదవిని దక్కించుకునేందుకు సుమారు రూ. 1.50 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇదే ప్రాంతంలోని ముంజేరు గ్రామంలో మరో వింత పరిస్థితి నెలకొంది. వ్యాపార నిమిత్తం ఎనిమిదేళ్ల క్రితమే ఊరు వదిలి రాయిపూర్ వెళ్లిపోయిన ఓ వ్యక్తి, ఇప్పుడు ఎన్నికల వేళ తిరిగి గ్రామంలో అడుగుపెట్టారు. తనను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేస్తే రూ. 1.30 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమంటూ గ్రామ పెద్దలతో రాయబారాలు నడుపుతున్నట్లు సమాచారం.

విజయనగరం సిటీకి సమీపంలోని జొన్నవలస గ్రామంలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. అధికార కూటమిలోని ఒక పార్టీ బలపరిచిన అభ్యర్థి, తనకు ఏకగ్రీవంగా అవకాశం ఇస్తే కోటి రూపాయలు ఇస్తానని ఆఫర్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఈ డబ్బు రాజకీయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జనసేనకు చెందిన కొందరు స్థానిక నేతలు ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.

కోట్లు పోసి కొంటున్నది సేవ కోసమా? వ్యాపారం కోసమా?

సాధారణంగా ఏ గ్రామానికైనా అభివృద్ధి పనుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాల ద్వారా నేరుగా నిధులు వస్తాయి. అలాంటప్పుడు సొంత జేబులోంచి కోటి, కోటిన్నర రూపాయలు ఖర్చు చేసి మరీ సర్పంచ్ పదవిని కొనుక్కోవాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న సామాన్యుల్లో తలెత్తుతోంది.

దీని వెనుక అసలు కారణం ప్రజాసేవ కాదనేది బహిరంగ రహస్యం. సర్పంచ్ హోదా ఉంటే ప్రభుత్వ అధికారులతో నేరుగా పరిచయాలు ఏర్పడతాయి. పట్టణ శివార్లు, ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో వెలుస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుమతులు ఇవ్వడం, పంచాయతీ పరిధిలో జరిగే భారీ కాంట్రాక్టు పనులను దక్కించుకోవడం, స్థానికంగా రాజకీయ ఆధిపత్యం చెలాయించడం వంటి ఆర్థిక ప్రయోజనాలే ఈ వేలం పాటల వెనుక ఉన్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అంటే, నేడు పెడుతున్న కోటి రూపాయల ఖర్చును రేపు పదవిలోకి వచ్చాక పదింతలుగా రాబట్టుకోవాలనే పక్కా వ్యాపార లెక్కలే ఇక్కడ కనిపిస్తున్నాయి.

డబ్బు సంచులకు చెక్ పెట్టేందుకు యువత రెడీ!

మూడు గ్రామాలు, మూడు వేర్వేరు ప్రచారాలు.. కానీ అంతటా ఒకటే చర్చ. డబ్బు సంచులతో గ్రామ నాయకత్వాన్ని శాసించాలని చూస్తున్న వారి తీరుపై ఇప్పుడు స్థానిక యువత తిరగబడుతోంది. జొన్నవలస, ముంజేరు, బైరెడ్డిపాలెం గ్రామాల్లోని యువకులు ఈ వేలం పాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తామే స్వయంగా ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.

గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా, ప్రేమతో తీసుకునే నిర్ణయమే అసలైన ఏకగ్రీవం అవుతుంది తప్ప.. డబ్బు పంపిణీ, ఒత్తిళ్లు, ప్రలోభాలతో అభ్యర్థులను పోటీ నుంచి తప్పించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని యువత స్పష్టం చేస్తోంది. ఏళ్ల తరబడి ఊరికి దూరంగా ఉన్నవాళ్లు, కేవలం వ్యాపార ప్రయోజనాల కోసం వచ్చేవాళ్లు కాకుండా.. గ్రామంలో నివసిస్తూ ప్రజల కష్టసుఖాలు తెలిసిన వారికే నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని వారు గట్టిగా నినదిస్తున్నారు. మరి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామాల్లో డబ్బు గెలుస్తుందా? లేక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చూస్తున్న యువత పోరాటం నిలుస్తుందా? అనేది వేచి చూడాలి.

తర్వాత చదవండి