తెలంగాణ

రాజీనామాకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు పాడి కౌశిక్ రెడ్డి సవాల్

Padi Kaushik Reddy: తెలంగాణలో పెన్షన్లు తొలగిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కొత్త పెన్షన్ల సంగతి ఏమో కానీ.. ఉన్న పెన్షన్లను కూడా రేవంత్ సర్కార్ తొలగిస్తోందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో 1029 పెన్షన్లు తొలగించారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కొత్తగా అనేకమందికి పెన్షన్లు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.

రాజీనామాకు నేను రెడీ.. మీరు సిద్ధమా?

తన నియోజకవర్గం హుజూరాబాద్ లో రేవంత్ రెడ్డి ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని కౌశిక్ రెడ్డి అన్నారు. పైగా 1029 పెన్షన్లు తీసేశారని చెప్పారు. తాను గాలి మాటలు మాట్లాడటం లేదని, లెక్కలతో సహా చెబుతున్నానని వెల్లడించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినట్లు చూపించినా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. లేదంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా? అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.