Harish Rao : రేవంత్ పక్కన చంద్రబాబు ఏజెంట్.. కాంగ్రెసోళ్లు కట్టుబానిసలు : హరీశ్ రావు
ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తాజాగా కౌంటర్ ఇచ్చారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఏపీ నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ విషయంలో సీఎం అడ్డంగా దొరికిపోయి ఎదురుదాడి చేస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. పల్నాడు ప్రాజెక్టు టెండర్ల వ్యవహారాన్ని పత్రికలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటపెట్టాకే కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాక్ డేట్‌తో ఉత్తరాలు రాసిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు 2025 జనవరి 24నే ఏపీ టెండర్లు పిలిచిందని నాడు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలో ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వానికి సోయి లేదా? అని నిలదీశారు. కాంగ్రెస్ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు గొంతు పెంచితే సరిపోదన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, పల్నాడు ప్రాజెక్టు వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
